తెలంగాణలో మళ్లీ ఆంధ్ర రాజకీయమా?
డా. తిరునహరి శేషు :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పుష్కర కాలమైంది. ఈ పన్నెండేళ్లలో మూడు పర్యాయాలు శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2014లో జరిగిన మొదటి శాసనసభ ఎన్నికలలో తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడి, ఆంధ్ర మూలాలున్న పార్టీలు కొంతవరకు తమ ఉనికిని చాటుకున్నాయి. కానీ, 2023 శాసనసభ ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో ఆంధ్ర మూలాలున్న రెండు పార్టీలు కనీసం పోటీ కూడా చేయకుండా తెలంగాణ రాజకీయాల నుంచి వైదొలిగాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ తెచ్చిన పార్టీ, ఇచ్చిన పార్టీ, రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన పార్టీలే తెలంగాణ రాజకీయాలలో అధికారం కోసం పోటీ పడుతున్నాయి. అయితే, ఇటీవల మళ్లీ ఏపీ రాజకీయాలలో మార్పులు రావడం, తెలంగాణపై, ముఖ్యంగా హైదరాబాద్‌పై, ఇక్క డి ఆస్తులపై మమకారం వదులుకోని సీమాంధ్ర పెట్టుబడిదారులు, నాయకులు తెలంగాణలో మరొకసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోటానికి ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తున్నది.
ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉంటున్న రెండు రాష్ట్రాల ప్రజల మధ్య తమ రాజకీయ అవసరాల కోసం, అధికారం కోసం, అవకాశాల కోసం కొన్ని పార్టీలు, కొందరు నాయకులు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా! మెడపట్టి బయటకు గెంటివేస్తే కట్టుబట్టలతో వచ్చాం’ లాంటి వ్యాఖ్యలతో మళ్లీ ప్రజల్లో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు.
మరోసారి కాలుపెట్టే ప్రయత్నం
2014 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో సీమాంధ్ర నాయకుల నేతృత్వంలోని రెండు పార్టీలు 24.3 శాతం ఓట్లను సాధించడమే కాదు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు 18 శాసనసభ నియోజకవర్గాలలో విజ యం సాధించాయి. కానీ, ఆ పార్టీల తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు ఆ తర్వాత పార్టీ మారటంతో 2018 శాసనసభ ఎన్నికల నాటికి ఒక పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకొంది. మరొక పార్టీ ఎన్నికలలో పోటీచేసి ఖమ్మం జిల్లాలో రెండు శాసనసభ నియోజకవర్గాలలో మాత్రమే గెలిచింది.
ఆ తర్వాత వారు కూడా పార్టీ ఫిరాయించటంతో ఆ రెండు సీమాంధ్ర పార్టీలు తెలంగాణ రాజకీ యాల నుంచి నిష్క్రమించినట్టయ్యింది. కాగా, 2018 ఎన్నికలలో సీమాంధ్రకు చెందిన ఒక బలమైన పార్టీ కాంగ్రెస్‌తో తమకున్న రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి, మరీ ఐదు పార్టీలను జతకట్టి మహా కూటమిని ఏర్పాటు చేసింది. అయితే, ఆ కూటమి ఎన్నికలలో ఘోర పరాజయం పాలవడంతో ఆ సీమాంధ్ర పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బలమైన ప్రాంతీయ పార్టీ ఓడిపోవడం, జాతీయ పార్టీ అధికారంలోకి రావడం, ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న నాయకులకు, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న నాయకులకు పూర్వాశ్రమంలో బలమైన స్నేహ సం బంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆం ధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీలు తెలంగాణలో కూ డా అధికారాన్ని చేజిక్కించుకునే ఎత్తుగడలలో భాగంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో గుసగుసలు వినపడుతున్నాయి.
ఆ ఊహాగానాలకు బలం చేకూ ర్చుతూ ఇటీవల మంగళగిరిలో జరిగిన మహానాడు వేదికపై నుంచి టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తెలంగాణలోనూ, అండమాన్‌లోనూ టీడీపీని విస్తరిస్తామని ప్రకటన చేశారు. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి జనసేన తెలంగాణలో ఉంటుందని, ఎన్నికలలో పోటీ కూడా చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రయోగాన్ని తెలంగాణలోనూ అమలు చేసి, ఇక్కడా అధికారం చేజెక్కించుకోవాలనే రాజకీయ వ్యూహాలకి పదును పెడు తున్నట్లుగా ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి.
కేసీఆర్‌కే అనుకూలం
ఒక ప్రొఫెసర్ చేసిన రాజకీయ విశ్లేషణ రెండు రాష్ట్రాల అంశంగా మారటం, ఎన్టీఆర్‌ను తెరపైకి తేవడం, రాష్ట్ర విభజనను దేశ విభజనతో పోల్చడం లాంటి పరిణామాలను మనం ఇటీవల చూస్తున్నాం. అయితే, ఆంధ్ర నాయకులు, పార్టీలు మరొకసారి తెలంగాణ గడ్డపై పాదం మోపే ప్రయత్నాలు చేసే క్రమంలో మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి వస్తే, అది తెలంగాణ ఉద్యమ పార్టీకి రాజకీయంగా అనుకూలించే అవకాశం ఉంది.
‘మేము అధికారంలో ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడిన సీమాంధ్ర పార్టీలు, నాయకులు నేడు తెలంగాణ మీ అ య్య జాగీరా! అని రెచ్చగొడున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను గద్దల్లాగా తన్నుకుపోవటానికి సీమాం ధ్ర రాజకీయ పెట్టుబడిదారులు చూస్తున్నారు.
రాజకీయం తెరచాటున తెలంగాణను మరొకసారి కాంగ్రెస్ సహకారంతో కబళించే ప్రయత్నం చేస్తున్నారు’ అని బీఆర్‌ఎస్ ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. ఇదే భావన ప్రజలలో కలిగితే తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయి, 2018 నాటి ఫలితాలు పునరావృతమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తెలంగాణలో మరొకసారి కేసీఆర్‌ను అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్, బీజేపీలు బలంగా కోరుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తున్నది. కాబట్టే, సీమాంధ్ర పార్టీలను మరొకసారి తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయోగం బీజేపీ చేస్తుందనే ఊహాగానాలు వినపడుతున్నాయి. లోకేష్, పవన్ కల్యా ణ్ తెలంగాణలో విస్తరిస్తామని, పోటీ చేస్తామనే ప్రకటనలు బీజేపీ ఆశీస్సులతోనే చేస్తున్నారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.
నిజానికి, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించకుండా ఉంటే, బీజేపీ మరొక రెండు లేదా మూడు శాతం ఓట్లు అదనంగా సాధించి ఉంటే కేసీఆర్ గెలుపు సునాయాసమయ్యేది. అప్పటికే పంజాబ్‌లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావంతో కేసీఆర్ ప్రకటించిన ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదం తో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలను ముందే పసిగట్టిన బీజేపీ.. బండి సంజయ్‌ను తప్పించి కాంగ్రెస్ విజయానికి పరోక్షంగా సహకరించిందనే అభిప్రాయం కూడా ఉంది.
ఇప్పటికే ఉత్తర, తూర్పు, పశ్చిమ భారత రాజకీయాలపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించిన బీజేపీ దక్షిణాదిలో కూడా విస్తరించాలనే వ్యూహం కేరళం, తమిళనాడు ఎన్నికలలో విఫలమైంది. ఈ నేపథ్యంలో 2028లో జరిగే కర్ణాటక, తెలంగాణ శాసనసభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ మరొక ప్రయత్నం చేస్తున్నది. కర్ణాటకలో సులభంగానే అధికారంలోకి రావచ్చని బీజేపీ భావిస్తున్నది.
కానీ, తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించటం, బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుండా చూసే ద్విముఖ వ్యూహంలో భాగంగానే తెలంగాణ రాజకీయాల్లోకి సీమాంధ్ర పార్టీల పునఃప్రవేశానికి బీజేపీ ఎత్తులు వేస్తున్నదా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే, తెలంగాణ పన్నెండేళ్ల ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లలో, సాధించిన ప్రగతిలో ‘తెలంగాణ మీ అయ్య జాగీరా!’ అని నిలదీసేవారు ఎక్కడున్నారనే ప్రశ్నకు వారు చెప్పే సమాధానం తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచలేకపోవచ్చు.
ఏదేమైనా తెలంగాణ లాంటి ఒక ఉద్యమ నేపథ్యంలో ఏ ర్పడిన రాష్ట్రం రాజకీయ పార్టీలకి, నాయకులకి ఒక రాజకీయ క్రీడా వేదికగా మారటం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. అది రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రతిబంధకమే కాదు, రాష్ట్ర ప్రతిష్టనూ మసకబారుస్తుంది.
వ్యాసకర్త సెల్: 9885465877






