7 June, 2026 | 1:58 AM

రైతులను ముంచుతున్న నకిలీ విత్తనాలు

07-06-2026 12:00 AM

కామిడి సతీష్‌రెడ్డి :

వానకాలం సీజన్ వచ్చిందంటే చాలు రైతులకు నకిలీల బెడద తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగుచేస్తే తీరా చేతికొస్తుందనుకున్న పంట రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీం తో రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మొదట్లోనే నకిలీ విత్తనాల ఆటకట్టిస్తే పంట చేతికొచ్చి, అన్నదాత నష్టపోకుండా నివారించవచ్చు.

వానకాలం సీజన్ కంటే ముందే నకిలీ విత్తన ముఠా చేయని ప్రయత్నమంటూ ఉం డదు. లూజ్ విత్తనాలను ఆకర్షణీయమైన కవర్లలో ప్యాకింగ్ చేసి రైతులకు తక్కువ ధరలకే అంటగడుతూ నిలువునా మోసం చేయ డం దళారులకు అలవాటుగా మారింది. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఏదో ఒకచోట నకిలీ విత్తనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రతీ వానకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా నాసిరకం విత్తనాల బెడద రైతాంగానికి పెను సవాల్‌గా మారింది.

అసలు ఏదో, నకిలీది ఏదో గుర్తించలేని విధంగా విత్తనాలు ఉంటుండటంతో రైతాం గం తీవ్రంగా నష్టపోతున్నది. ప్రధానంగా వరి, పత్తి విత్తనాలు నాసిరకం కావడంతో రై తులకు నష్టాలు తప్పడం లేదు. తీరా పత్తి పంటలో దిగుబడి రాక రైతులు ఆర్థికంగా దెబ్బతింటుండగా, వరిలో సైతం తెగుళ్లు, తా లు, నాణ్యత లేకపోవడంతో రైతులు పంట చేతికొచ్చే సమయంలో లబోదిబోమంటున్నారు. వరి, పత్తి విత్తనాల విషయంలో దళా రులదే పెత్తనమైంది.

గ్రామీణ ప్రాంతాల్లో దళారులు రైతులను మచ్చిక చేసుకుని తక్కు వ ధర, అధిక దిగుబడులు, తక్కువ సమయంలో పంట చేతికి వస్తుందని నమ్మించి నాసిరకం విత్తనాలు అంటగడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నా దళారుల దందాను నిలువరించలేక పోతున్నారు. గత ఏడాది మే నెలలో అన్ని జిల్లాల్లో వ్యవసాయ శాఖ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. పలు జిల్లాల్లో కేసుల ను కూడా నమోదు చేసిన సందర్భాలున్నా యి.

ఒకానొక దశలో పీడీ యాక్ట్ కూడా అమలు చేశారు. అయినప్పటికీ విత్తనాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. పెట్టుబడులు చేతిలో లేని రైతులు తక్కువ ధరకు వచ్చే విత్తనాలను తీసుకుంటున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు.

తాజాగా వ్యవసాయ శాఖతో పాటు పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో టాస్క్‌ఫోర్స్ టీంలు ఏర్పడి తనిఖీ లు విస్తృతంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతీ సంవత్సరం తనిఖీ లు చేస్తున్నా, ఎక్కడో ఒక చోట నకిలీ విత్తనాల బెడద తప్పడం లేదు. అన్ని జిల్లాల్లో గతంలో లూజు పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రజాప్రతినిధుల అండతో..

ఈ నెల నాలుగో వారం నుంచి వ్యవసా య సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రైతులు దుక్కులను సిద్ధం చేసుకున్నారు. ఈ నెలాఖరులో తెలంగాణలో సైతం ముందస్తు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిస్తే ముందుగానే విత్తనాలు వేస్తారు. ఈ నెల చివర్లో రోహిణి కార్తె ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా వరి, పత్తి లక్షల హెక్టార్‌లలో సాగవుతాయి.

ఈ నేపథ్యంలో కొందరు డీలర్లు తమకు ప్రజాప్రతినిధుల అండ ఉందని బాహాటంగా పేర్కొంటూ దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తు న్నాయి. తమ దుకాణాలను టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయకుండా ప్రజాప్రతినిధుల అండతో వారు తప్పించుకుంటు న్నట్టు తెలుస్తున్నది. ఈసారైనా అధికారులు పత్తి విత్తనాలు విక్రయించే డీలర్లపై నిఘా పెడతారా, తనిఖీలు చేస్తారా? అనేది వేచిచూడాలి.

ఆంధ్ర నుంచి నిషేధిత విత్తనాలు

అమెరికాలోని మోనోశాంటో కంపెనీకి చెందిన బీటీ-3 రకం విత్తనాలపై దేశవ్యాప్తంగా నిషేదం ఉంది. బీటీ--1, బీటీ--2 రకా లకు మాత్రమే అనుమతి ఉంది. దాదాపు 20 ప్రధాన కంపెనీలకు చెందిన అనుమతి గల విత్తనాలను అందుబాటులో ఉంచారు. మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధికంగా పత్తి జిన్నింగ్ మిల్లులు ఉండటంతో విత్తనోత్పత్తి సులువుగా జరుగుతున్నది. అ న్ని రకాల విత్తనాలు నష్టం కలిగించనప్పటికీ, దళారుల జోక్యంతో బీటీ--2 రకం విత్తనాల పేరిట బీటీ--3 రకం విత్తనాలను అంటగడుతున్నట్లు సమాచారం.

దీంతోపాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని మాచర్ల నుంచి సైతం అన్ని జిల్లాలకు నాసిరకం విత్తనాలతోపాటు బీటీ--3 రకం విత్తనాలు కూడా చేరుతున్నట్లు తెలుస్తున్నది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ సరిహద్దులోనే మాచర్ల ఉండటంతో సులువుగా వివిధ మార్గాల్లో నకిలీ పత్తి విత్తనాలు తెలంగాణకు చేరుతున్నాయి. మహా రాష్ట్ర నుంచి కూడా నకిలీ విత్తనాలు వస్తున్నాయి. వాస్తవానికి రైతులు పత్తి, వరి విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే వారికి డీలర్లు, వ్యాపారులు బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ, చాలాచోట్ల రశీదు ఇవ్వకుండా రైతులను మభ్యపెట్టి పంపించి వేస్తున్నారు. పంట దిగుబడులు తక్కువగా వచ్చినప్పుడు రైతులు నిలదీస్తారన్న భయంతో ఏ వ్యాపా రి కూడా బిల్లులు ఇవ్వడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌ల నుంచి మన రాష్ట్రంలోకి నకిలీ విత్తనాలు వస్తున్నాయి. రోడ్డుమార్గం ద్వారా పట్టుబడుతుండటంతో ఈమధ్య కొంతమంది దళారులు రైళ్లలో తరలించడం, లేదంటే ట్రాన్స్‌పోర్ట్ వాహనాల్లో జిల్లాలకు చేరవేస్తున్నారు.

ఒరిజినల్ కంపెనీలకు చెందిన ప్యాకెట్ల మాదిరిగానే నకిలీ ప్యాకెట్లు తయారుచేసి అందులో నాసిరకమైన పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం వ్యవసాయ శాఖ అధికారులు వరితో పాటు పత్తి విత్తనాలకు సంబంధించిన నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కొంతమంది దళారులు పత్తి రైతుల ను డిస్కౌంట్‌ల పేరిట నాసిరకం విత్తనాలు అంటగడుతున్నారు. ఈ క్రమంలో రైతులకు అనుమానం రాకుండా భోజనాల ఖర్చులు ఇవ్వడం, రానుబోను వాహన చార్జీలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. 

అప్రమత్తత అవసరం

ఈ నేపథ్యంలో ప్రతీ రైతు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇతర ప్రాంతాల నుంచి బీటీ-2 విత్తనాల పేరిట బీటీ-3 విత్తనాలను అంటగట్టే ప్రమాదం ఉంది. బీటీ--3ని కేంద్రం నిషేధించింది. రైతులు పూర్తిస్థాయిలో అనుమతులున్న డీలర్లు, వ్యాపారుల వద్దే విత్తనాలను కొనుగోలు చేసి రశీదులు తీసుకోవాలి.

దళారుల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాలను కొనుగోలు చేయవద్దు. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. నాణ్య మైన విత్తనాలకు మాత్రమే అనుమతి ఇవ్వా లి. నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. తద్వారా అన్నదాతలు మోసపోకుండా చూడాలి. 

 వ్యాసకర్త సెల్: 9848445134