calender_icon.png 21 February, 2026 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్‌వాడీ కేంద్రాలు ఆగమాగం!

21-02-2026 12:00:00 AM

ఝరాసంగం మండలంలో 18 హెల్పర్ పోస్టులు ఖాళీ

18 కేంద్రాల్లో అందని పౌష్టికాహారం

పట్టించుకోని అధికారులు

జహీరాబాద్, ఫిబ్రవరి 20 : అంగన్వాడీ కేంద్రాలలో సహాయక సిబ్బంది లేకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో 54 అంగన్వాడి కేంద్రాలు ఉండగా అందులో ఒక  టీచర్ పోస్టుతో పాటు 18 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు తరలించకపోవడంతో వారికి పౌష్టికాహారం సకాలంలో అందడం లేదు.

చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారంతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా సరైన సమయంలో పౌష్టిక ఆహారం అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు విఫలమవుతున్నాయి. ప్రతిరోజు గర్భిణీ స్త్రీలకు రోజుకు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల మంచి నూనె, 200 మిల్లీ లీటర్ల పాలు, ఒక గ్రుడ్డు అందించాలి. కానీ లేకపోవడంతో గర్భిణీ స్త్రీలకు సరైన సమాచారం అందకపోవడంతో వారు ఈ పౌష్టికాహారాన్ని కోల్పోతున్నారు. కృష్ణాపూర్ అంగన్వాడి కేంద్రం 2లో అంగన్వాడి టీచర్ లేకపోవడంతో పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని సకాలంలో అందించలేకపోతున్నారు.

కృష్ణాపూర్ లో అంగన్వాడి టీచర్ను నియమించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. అలాగే మాసునూరు, గినియార్పల్లి, చీలమామిడి, ఇస్లాంపూర్, బర్దిపూర్, కుప్పానగర్ లలో అంగన్వాడి టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రతిరోజు పిల్లలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం అందించడంలో  కేంద్రాలు సక్రమంగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంగన్వాడీలలో పనిచేసే టీచర్లు పట్టణాల్లో ఉండడం వల్ల సకాలంలో వారు గ్రామాలకు హాజరు కాకపోవడం, చిన్నపిల్లలకు అందించవలసిన పౌష్టికాహారం అందించకపోవడంతో వారి జీవన ప్రమాణం పెరగడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రత్యేకించి అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే టీచర్లు, ఆయాలు ఆయా గ్రామాలకు చెందిన కోడళ్ళు అయి ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు పట్టణాల్లో నివసిస్తూ సక్రమంగా అంగన్వాడి కేంద్రాలకు రాకపోవడంతో వారికి విడుదలైన సరుకులను ఆయా అంగన్వాడి కేంద్రాల టీచర్లు కాజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా మండల, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఈ విషయమై ఝరాసంగం అంగన్వాడీల సూపర్వైజర్ అనితను వివరణ కోరగా ప్రతిరోజు చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు సరైన సమయంలో పౌష్టికాహారం అందిస్తున్నామని, అంగన్వాడి టీచర్లు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.