calender_icon.png 18 August, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీలను బలోపేతం చేయాలి

18-08-2025 05:44:39 PM

కలెక్టరేట్ ఎదుట ధర్నా

మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాలకే అప్పగించి విద్యాబోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ఇవ్వాలని, ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం  సిఐటియు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు, తెలంగాణ అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బెస్త సంపూర్ణ, ధారా స్నేహ బిందు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ను, విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని, దీనివల్ల రాబోయే కాలంలో అంగన్వాడీ వ్యవస్థ క్రమేణ రద్దు  చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ, ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఐదు సంవత్సరాలలోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం సబబు కాదని, విద్యాబోధన బాధ్యతను అంగన్వాడీలకు మాత్రమే ఇవ్వాలని కోరారు.  ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు విద్య తోపాటు, పౌష్టికాహారాన్ని అందిస్తూ మానసిక, శారీరక అభివృద్ధికి గత 50 సంవత్సరాలుగా పాటుపడుతున్న అంగన్వాడి వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ విధానాన్ని తక్షణం మార్చుకొని అంగన్వాడీలకే అదనపు వేతనం చెల్లించి, పీఎం శ్రీ, ప్రైమరీ స్కూల్లో బాధ్యతను వారికి అప్పగించాలని కోరారు.

అలాగే బిఎల్ఓ తదితర అదనపు పనులను అప్పగించడం తొలగించి, విద్యాబోధన మాత్రమే వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ శాఖకు ప్రభుత్వ నిధులను పెంచి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న, వాసం దుర్గారావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు సులోచన, సంధ్య, నీల, లలిత, లీల, ఆండాలు, సరోజ, విజయ, పద్మ, సుజాత, మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు.