18-08-2025 06:08:08 PM
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్య నాయక్
వనపర్తి,(విజయక్రాంతి): బహుజనుల హక్కులకై పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్య నాయక్ అన్నారు. సర్వాయి పాపన్న 375వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బి.సి.సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జ్ యాదయ్య, వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ పి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ముఖ్య అతితులుగా హాజరై సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ మాట్లాడుతూ మొఘల్ రాజులను ఎదుర్కొని, అప్పుడు ఉన్న పరిస్థితులను ఎదుర్కొని బహుజనులకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి న్యాయం చేశారన్నారు. అందుకే ప్రభుత్వం ప్రతి సంవత్సరం సర్వాయి పాపన్న గౌడ్ జయంతినీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బహుజనులకు చేరడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సర్వాయి పాపన్న ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, బి.సి.సంక్షేమ శాఖ అధికారి పాండు, జిల్లా అధికారులు, సంఘ నాయకులు సైతం సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.