బీఎల్‌ఓ విధులతో సతమతమవుతున్న అంగన్వాడీలు
బీఎల్‌ఓ నుంచి అంగన్వాడీలను మినహాయించాలి!
చిన్నారులా? ఓటర్లా? చర్లలో అంగన్వాడీల అవస్థలు..
రెండు బాధ్యతలు ఒకేసారి - పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో?
చర్ల, జులై 28 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అంగన్వాడీ టీచర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒకవైపు బడిలో చిన్నారుల సంరక్షణ, మరోవైపు బిఎల్‌ఓ విధులు. రెండు గుదిబండల్లా మారి వారిని కుదేలు చేస్తున్నాయి. రెట్టింపైన పనిభారం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, బరువు నమోదు, గుడ్లు, బాలామృతం పంపిణీ, డ్రాప్ అవుట్ పిల్లల వివరాలు, యాప్ ఆధారిత పనులు ఇప్పటికే తలకు మించి ఉన్నాయి.
కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోయినా ఫోన్లో అప్డేట్లు చేయాల్సి వస్తోంది.దీనికి తోడు ఎన్నికల విధుల పేరిట బిఎల్‌ఓ డ్యూటీలు అప్పగించడంతో పని ఒత్తిడి రెట్టింపు అయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సెంటర్లో పిల్లలతో ఉండాలి. మధ్యలో యాప్ అప్డేట్లు చేయాలి. అదే సమయంలో ఇంటింటికి తిరిగి ఓటర్ జాబితా పని, ఫారాలు నింపాలంటే ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు.
పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం
‘బిఎల్‌ఓగా తిరగడం వల్ల కేంద్రాలకు సకాలంలో వెళ్లలేకపోతున్నాం. దీనివల్ల పిల్లల పోషణ, విద్యపై తీవ్ర ప్రభావం పడుతుంది‘ అని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం అంగన్వాడీల ప్రధాన బాధ్యత పిల్లల సంక్షేమని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వారిపై పలు శాఖల పనులు రుద్దుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
మినహాయింపు ఇవ్వాలి - సీఐటీయూ డిమాండ్
తమను బిఎల్‌ఓ విధుల నుంచి వెంటనే మినహాయించాలని, లేదంటే అదనపు సిబ్బందిని నియమించాలని అంగన్వాడీలు జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఈ అంశంపై అధికారులు తక్షణమే స్పందించి అంగన్వాడీలకు న్యాయం చేయాలని స్థానికులు, సీఐటీయూ నాయకురాలు పాయం రాధాకుమారి డిమాండ్ చేశారు.






