calender_icon.png 2 February, 2026 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ మొండి చెయ్యే!

02-02-2026 03:29:25 AM

పదేళ్లు దాటినా కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన ఫలితమేది?

నిధుల కేటాయింపు కోసం తెలంగాణ నిరీక్షణ

ఇప్పటికీ పెండింగ్‌లో అనేక డిమాండ్లు

బడ్జెట్‌పై ఏటా ఆశలు అడియాశలే

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణకు మధ్య ఉన్న అంతరం, రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న సవతి ప్రేమ ఏటా బడ్జెట్ సమయంలో స్పష్టంగా తెలుస్తోంది. ఈసారి కేంద్ర బడ్జెట్‌లోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను గమనిస్తే ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడి పదేళ్లు దాటినా తెలంగాణకు దక్కిందేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆశలు, హామీలు, ప్రతిపాదనలు అన్నీ కూడా మరోసారి ఫైళ్లకే పరిమితమయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కేవలం పరిపాలనలో మాత్రమే మార్పు కాదని, ఒక ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ఆశలు, ఆకాంక్షలు, ఆర్థిక న్యాయానికి ప్రతీక అని భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో ప్రతిఫలం కనిపించడం లేదనే అసంతృప్తి రాష్ట్ర ప్రజానీకంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద తెలంగాణకు ఇచ్చిన హామీలు న్యాయబద్ధమైనవే అయినప్పటికీ, పదేళ్లు గడిచినా వాటి అమలు పూర్తిస్థాయిలో జరగకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అనుమానాలను పెంచుతోంది. తాజా బడ్జెట్‌లో ఆ హామీలపై కనీస ప్రస్తావన కూడా లేకపోవడం, తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. 

కేంద్రానికి వద్ద ఉన్న ప్రతిపాదనలు

తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన దాదాపు 12 విభాగాలకు సంబంధించి 47 అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ సుమారు 350 కి.మీ.ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులతో పాటు రూ.34,367 కోట్లు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం కోరింది. ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ ‘రేడియల్ రోడ్ల కోసం రూ.45 వేల కోట్లు అవసరమవుతుంది. ఓఆర్‌ఆర్ కలుపుతూ కొత్తగా 10 రేడియల్ రోడ్ల అభివద్ధి ప్రతిపాదలను ఇప్పటికే కేంద్రానికి సమర్పించారు. వీటికి రూ.45 వేల కోట్ల నిధుల మంజూరు కోరింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ కోసం రూ.44,028 కోట్లు కోరింది.

హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా మెట్రో రైలు ఫేజ్ ప్రాజెక్టు కోసం ఫేజ్ ఫేజ్ ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. గోదావరి నుంచి మూసీకి నీటిని మళ్లించే లింక్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.6 వేల కోట్ల ఆర్థిక సాయం కోరింది. వరంగల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టుకు కేంద్ర నిధులు, హైదరాబాద్ సమగ్ర మురుగు నీటి మాస్టర్ ప్లాన్, ‘బందర్ పోర్ట్’ నుంచి హైదరాబాద్ సమీప డ్రై పోర్ట్ వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం, దాదాపు రూ.17 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని కోరింది.

ఆదిలాబాద్, కొత్తగూడెం, బసంత్ నగర్ విమానాశ్రయాలు, ఇటీవలే వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్‌లకు ఆమోదం తెలిపింది. తెలంగాణలో 8 కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వికారాబాద్ కొత్త రైలు మార్గం, కల్వకుర్తి రైలు లైన్, గద్వాల్ రైలు మార్గం, కాచిగూడ రైలు మార్గం, పటాన్‌చెరు- రైలు లైన్, బోధన్- రోడ్ లైన్, అక్కన్నపేట బైపాస్ రైలు లైన్, పాండురంగాపురం రోడ్ లైన్ పెండింగ్‌లో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణను చేర్చడం, ఖమ్మం లేదా మహబూబాబాద్ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, పీఎం మిత్ర కింద కాకతీయ మెగా టెక్ట్‌టైల్స్ పార్కుకు కేంద్రం సాయం, తెలంగాణ రైజింగ్ విజన్2047 లక్షానికి అనుగుణంగా లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులు రావాల్సి ఉన్నాయి.

పవర్ సిస్టం డెవలప్‌మెంట్ ఫండ్ కింద 6 ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు, పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ పంప్ సెట్ల కేటాయింపు, సింగరేణికి బొగ్గు బ్లాకుల గుర్తింపును డిచెర్ల కోల్ బ్లాక్ మైనింగ్ లీజ్ పెండింగ్‌లోనే ఉన్నాయి. నవోదయ విద్యాలయాలు లేని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల మంజూరు, కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు, హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కాలేజీలు మంజూరు కావా ల్సి ఉంది. పీఎంఏవైలో  భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు పీఎంఏవై చేపట్టాలి. 

డిమాండ్లన్నీ పెండింగ్‌లోనే

రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు దాటినా తెలంగాణకు రావాల్సిన కీలక నిధులు, అనుమతులు, జాతీయ స్థాయి ప్రాజెక్టులు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పెండింగ్‌లోనే ఉన్నాయి. దాదాపు 12 కీలక విభాగాలకు సంబంధించిన 47 అంశాలు కేంద్రం వద్ద పరిష్కారం కోసం ఎదురుచూస్తుండటంతో, కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రవాణా, నీటిపారుదల, పరిశ్రమలు, విద్య, విద్యుత్, హౌజింగ్ వంటి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక మెగా ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం, అనుమతులు కోరుతూ ఇప్పటికే పలు మార్లు విజ్ఞప్తులు చేసింది.

వేల కోట్ల రూపాయల మెగా ప్రాజెక్టులు, కీలక మౌలిక వసతుల అభివద్ధిపై రాష్ర్టం ఆశలు పెట్టుకున్నప్పటికీ, తాజా బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేకంగా కనిపించే కేటాయింపులు లేకపోవడం రాజకీయ దుమారం రేపుతోంది. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో ఫేజ్2, కొత్త రైల్వే లైన్లు, పరిశ్రమల ప్రాజెక్టులు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ, కేంద్ర బడ్జెట్‌లో వాటికి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం నిరాశకు గురిచేసింది. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, రవాణా సౌకర్యాలపై కేంద్రం నుంచి భారీ సహకారం వస్తుందన్న అంచనాలతో రాష్ర్టం ముందుకెళ్లింది. అయితే పదేళ్లు గడిచినా, ఆ హామీల అమలు ఆశించిన స్థాయిలో జరగకపోవడం రాజకీయంగా, పరిపాలనపరంగా పెద్ద ప్రశ్నగా మారింది.

ఆశించిన స్థాయిలో చేకూరని లబ్ధి

ఆదివారం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరలేదు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ డిమాండ్లకు స్పష్టమైన నిధుల మంజూరు లేదు. రూ.లక్షల కోట్ల విలువైన మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే పీఎంఏవై, అమృత్, రైల్వేలు, జాతీయ రహదారులు సాధారణ పథకాలకే పరిమితమైంది. వీటికి సంబంధించి సాధారణ కేటాయింపులు మాత్రమే ఉన్నాయి. దీంతోపాటు బడ్జెట్‌లో రాష్ట్ర విభజన హామీల ప్రస్తావనే లేదు. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లోని మౌలిక వసతులు, విద్యా సంస్థలు, పరిశ్రమల హామీలు బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా స్పష్టంగా ప్రస్తావించలేదు. బడ్జెట్ కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికైనా కేంద్రం తెలంగాణను ఒక సాధారణ రాష్ర్టంగా కాకుండా, ప్రత్యేక నేపథ్యం కలిగిన రాష్ర్టంగా చూడాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది. బడ్జెట్ ప్రకటనలకే పరిమితం కాకుండా, స్పష్టమైన కాలపరిమితితో కూడిన అమలు ప్రణాళిక అవసరమని, దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన డిమాండ్లను మరింత బలంగా, రాజకీయాలకు అతీతంగా, నిరంతరంగా కేంద్రం ముందుంచాల్సిన బాధ్యతను విస్మరించకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధుల కోసం వేచి చూసే నిరీక్షణకూ హద్దు ఉంటుందని, ఆ హద్దు దాటితే ఈ అంశం రాజకీయాల పరిధి దాటి ప్రజల అంశంగా మారుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. కేవలం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

తెలంగాణకు కేటాయించినవి

హై స్పీడ్ రైల్ కారిడార్స్ హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, పూణె టు హైదరాబాద్.

ఫ్రైట్ కారిడార్‌లో తెలంగాణకు చోటు దక్కే అవకాశం

హైదరాబాద్ మెడికల్ హబ్ కాబట్టి బయో ఫార్మా హబ్, మెడికల్ టూరిజంలో పెద్ద వాటా దక్కే అవకాశం

వరంగల్, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో మెగా టెక్స్ టైల్స్ పార్క్ లకు ప్రోత్సాహకాలు దక్కే చాన్స్

డేటా సెంటర్లు నెలకొల్పే వారికి 2047 వరకు ట్యాక్స్ ఫ్రీ కాబట్టి తెలంగాణకు మంచి అవకాశం

యూటీల ప్రగతికి నిధుల వెల్లువ

కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధికి పద్దులో ప్రాధాన్యం

మొత్తంగా రూ.౬౫,౦౦౦ కోట్ల కేటాయింపు

నిధుల్లో అత్యధికంగా జమ్మూకశ్మీర్‌కు 43,290 కోట్లు 

దేశ రాజధాని ఢిల్లీకి 1,168.01 కోట్లు 

ఢిల్లీ పోలీస్ విభాగానికి ఆర్థికపరమైన దన్ను

కమ్యూనికేషన్, సాంకేతికత పెంపునకు విడిగా 12,503 కోట్లు

ప్రజారోగ్యం, పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేంద్రపాలిత ప్రాంతాల (యూటీల) సమగ్ర అభివృద్ధికి భారీ నిధులు కేటాయించింది. ఆయా ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రాధాన్యమిచ్చింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, ద్వీపకల్ప ప్రాంతాల మౌలిక వసతులకు కేటాయింపులు పెంచింది. కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటికీ కలిపి ఈసారి సుమారు రూ. 65,000 కోట్లకు పైగా నిధులు కేటాయించగా, వాటిలో జమ్మూ కశ్మీర్‌కు అత్యధికంగా రూ. 43,290 కోట్లు దక్కడం విశేషం.

అలాగే గత ఆర్థిక సంవత్సరంలో యూటీలకు సుమారు రూ.60,000 కోట్ల కేటాయింపు జరిగింది. యూటీల బడ్జెట్ ఈసారి 8 10శాతం  వరకు పెరిగింది. కేంద్రం నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి పెద్దపీట వేసింది. అందుకు రూ.39,390 కోట్లు కేటాయించింది. నిధుల ద్వారా మాతా శిశు సంరక్షణ, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు యూటీల్లో ముమ్మరం కానున్నాయి. అలాగే ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా కేంద్రం జిల్లా ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు నిర్మించనుంది.

అత్యధికంగా కశ్మీర్‌కు 

నిధుల కేటాయింపులో జమ్మూ కశ్మీర్‌కు సింహభాగం దక్కించుకన్నది. కశ్మీర్ అభివృద్ధికి కేంద్రం ఏకంగా రూ.43,290 కోట్లు కేటాయించడం విశేషం. గత బడ్జెట్‌లో రూ.37,277 కోట్లు కేటాయించగా, ఈసారి 13 శాతం మేర నిధులు పెంచడం గమనార్హం. ఈ నిధులు కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, పర్యాటక రంగాలకు ఊతమివ్వనున్నాయి.

చండీగఢ్‌కు

చండీగఢ్‌కు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.5,720.17 కోట్లు కేటాయించింది. నగర ప్రణాళికలో భాగంగా కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అడ్వానస్డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ద్వారా వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోనుంది. దీనివల్ల నగరంలో కాలుష్యం తగ్గించాలని కంకణం కట్టుకున్నది. అలాగే నగర పోలీసులు మరింత మెరుగైన శిక్షణ పొందేలా ప్రత్యేకంగా నిధులు కేటాయించింది అలాగే నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, రవాణా వ్యవస్థ మెరుగుదల, విద్యా రంగాలకూ నిధులు ఉపయోగపడనున్నాయి.

లద్దాఖ్‌కు..

లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం కోసం కేంద్రం 5,958 కోట్ల రూపాయలను కేటాయించింది. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతంలో సరిహద్దు రహదారుల నిర్మాణం, విద్యుత్ సరఫరా మెరుగుదలకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. గత ఏడాది కేటాయింపులతో పోలిస్తే లడఖ్ నిధులలో సుమారు 10 శాతం పెరుగుదల నమోదైంది. పర్యావరణ హితమైన సౌర విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం ఇక్కడ అధిక ప్రాధాన్యతనిస్తోంది. 

ఇతర యూటీలకు..

అండమాన్ నికోబార్ దీవుల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.5,990 కోట్లు కేటాయించింది. సముద్ర తీర భద్రత, నౌకాశ్రయాల ఆధునీకరణకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. అలాగే పుదుచ్చేరి అభివృద్ధికి రూ.3,124 కోట్లు, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూకి కలిపి రూ.2,648 కోట్లు, లక్ష్యద్వీప్‌కు రూ.1,490 కోట్లు కేటాయించంది. లక్షద్వీప్‌లో పర్యాటక రంగానికి వసతుల కల్పన, కనెక్టివిటీని మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. పుదుచ్చేరిలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా చూపేంపదకు నాలుగు కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం నిధులను మంజూరు చేసింది.

దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధికి  

కేంద్రం దేశ రాజధాని ఢిల్లీకి రూ.1,168.01 కోట్లు కేటాయించింది. ఈ నిధులు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ఇతర నగరాభివృద్ధి పనులకు ఉపయోపడనున్నాయి. ఢిల్లీ పోలీస్ విభాగ బలోపేతం కోసం కేంద్రం విడిగా మరో రూ.12,503.65 కోట్లు కేటాయించడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఈ నిధులు 4.79 శాతం మేర పెంచడం మరో విశేషం. నిధులతో ఢిల్లీ పోలీస్ విభాగం అత్యాధునిక సాంకేతికతను సమకూర్చుకోనుంది. మెరుగైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్, మోడల్ ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.

టార్గెట్.. అరుదైన ఖనిజాల సమృద్ధి

‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’కు రూ.౩౪,౩౦౦ కోట్లు

ఖనిజాల కోసం చైనాపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిపై దృష్టి

ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరంలో రేర్ ఎర్త్ కారిడార్లు

రీసైక్లింగ్‌కు ప్రోత్సాహం.. ఈ -వేస్టేజీ నుంచి ఖనిజాల సేకరణ 

అందుకు 1,500 కోట్లతో ప్రత్యేక పథకం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧: ఆర్థిక స్వయం సమృద్ధి సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కేంద్ర బడ్జెట్‌లో క్రిటికల్ మినరల్స్ (అరుదైన ఖనిజాల) సముపార్జనకు కొత్తగా ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ను ప్రకటించింది. మిషన్‌లో భాగంగా ఏడేళ్ల కాల పరిమితి విధించుకుని రూ.34,300 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిర్ణయంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, సెమీ కండక్టర్లు, రక్షణ పరికరాల తయారీకి అవసరమయ్యే ఖనిజాల సమీకరణకు బాటలు పడతాయి. ఈ ఖనిజాల సేకరణ విషయంలో ప్రస్తుతం భారత్ 45 శాతానికి పైగా చైనాపైనే ఆధారపడుతున్నది. దీర్ఘకాలం చైనాపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ అడుగులు వేయనుంది. ఆ ఖనిజాల తవ్వకాలు, ప్రాసెసింగ్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనుంది. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, తమిళనాడులో ‘రేర్ ఎర్త్ కారిడార్లు’ ఏర్పాటు చేయనుంది.

ఆయా రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో అపారమైన మోనజైట్, థోరియం, నియోడైమియం తదితర ఖనిజ నిక్షేపాలను వెలికితీయనుంది. వెలికితీసిన ఖనిజ నిక్షేపాలను నిల్వ చేసేందుకు యూనిట్లు నెలకొల్పనుంది. ప్రాసెసింగ్ ప్లాంట్లనూ ఏర్పాటు చేయనుంది. అక్కడి నుంచి వాటిని ఓడరేవులకు రవాణా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయనుంది. కేవలం ఖనిజాల సేకరణపైనే కాకుండా రీ సైక్లింగ్‌కూ పెద్దపీట వేసింది. పాత ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, పారిశ్రామిక తుక్కు (ఈ నుంచి తిరిగి ఖనిజాల రికవరీ చేసే యూనిట్లకు రూ.1,500 కోట్ల నిధులను కేటాయించింది. 2026 31 వరకు ఈ స్కీం అమలవుతుంది’. ఈసమగ్ర వ్యూహం ద్వారా వచ్చే ఐదేళ్లలో సుమారు 50,000 మందికి ఉపాధి కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది.

ఈ బడ్జెట్ చరిత్రాత్మకం

ప్రతి భారతీయుడి కలలను నెరవేరుస్తుంది

సంస్కరణలను బలోపేతం చేస్తుంది

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఊపందుకుంటుంది 

బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ  

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ దేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక మైలు రాయి అని,140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల బడ్జెట్ అని అభివర్ణించారు. ప్రతి భారతీయుడి కలలను నెరవేర్చే బడ్జెట్ అని పేర్కొన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం అని మోదీ స్పష్టం చేశారు. 2047 నాటికి వికసిత భారత్ సంకల్పాన్ని సాధించే దిశగా దేశం వేగంగా దూసుకెళ్లేందుకు ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుందన్నారు. ఈ బడ్జెట్ చాలా ప్రత్యేకమైనదని.. అధిక మూలధన వ్యయం, అధిక వృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్పణాన్ని నియంత్రించడంపై దృష్టి సారిస్తుందన్నారు.సామాన్య పౌరుడు విక్షిత్ భారత్ లక్ష్యాన్ని నడిపించబోతున్నాడు అని తెలిపారు.

బడ్జెట్‌ను శక్తి గుణకంగా అభివర్ణించడమే గాకుండా పెట్టుబడులు, వినియోగాన్ని పెంచుతుందన్నారు. ‘ఈ బడ్జెట్ శక్తిని గుణించేది.. ఈ బడ్జెట్ పొదుపు, పెట్టుబడి, వినియోగం, వృద్ధిని వేగంగా పెంచుతుంది.. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందాన్ని నేను అభినందిస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు. వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రిగా అరుదైన రికార్డును ఆమె సొంతం చేసుకున్నారని అన్నారు. ఈ బడ్జెట్ చరిత్రాత్మకం.. దేశంలోని మహిళా సాధికారతను ప్రతిబింబిస్తోంది అని అన్నారు.సాధారణంగా బడ్జెట్ దృష్టి ప్రభుత్వ ఖజానాను ఎలా నింపుతుందనే దానిపై ఉంటుంది, కానీ ఈ బడ్జెట్ దానికి పూర్తి విరుద్దంగా ఉంది.

ఈ బడ్జెట్ దేశ పౌరుల జేబులను ఎలా నింపుతుంది? దేశ ప్రజల పొదుపు ఎలా పెరుగుతుంది? దేశ పౌరులు అభివృద్ధి భాగస్వాములు ఎలా అవుతారు.. దీనికి ఈ బడ్జెట్ చాలా బలమైన పునాది వేస్తుంది. సంస్కరణల పరంగా, ఈ బడ్జెట్‌లో అనేక ముఖ్యమైన చర్యలు తీసుకోబడ్డాయి. అణుశక్తిలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం చారిత్రాత్మకం. ఇది దేశ అభివృద్ధిలో పౌర అణుశక్తి పెద్ద సహకారాన్ని నిర్దారిస్తుంది’అని మోదీ అన్నారు. బడ్జెట్‌లో అన్ని రకాల ఉపాధి రంగాలకు అన్ని విధాలుగా ప్రాధాన్యత కల్పించామన్నారు. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ వేగానికి ఊతమిచ్చే రోడ్ మ్యాప్ ఈ బడ్జెట్ అని పేర్కొన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఊపందుకుంటుంది.. అదేవిధంగా దేశంలో పర్యాట రంగం కూడా అభివృద్ధి చెందుతుందని, పర్యాటకానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నారు.50 ముఖ్యమైన పర్యాటక స్టేషన్లలో హౌటళ్లు నిర్మించబడతాయన్నారు. మొదటిసారిగా హోటళ్లను మౌలిక సదుపాయాల పరిధిలోకి తీసుకురావడం ద్వారా టూరిజం పెద్ద ఎత్తున ఊపందుకుంటుందని అని మోదీ అన్నారు. అలాగే ‘భారతదేశాన్ని గ్లోబల్ డేటా సెంటర్ హబ్‌గా మార్చడానికి పెద్ద పన్ను మినహాయింపు ప్రకటించాం. ఇది ఉపాధి కల్పనను గణనీయంగా పెంచుతుంది’ అని పేర్కొన్నారు. అలాగే మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక సంఘాల కోసం ఆధునిక పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ఈ బడ్జెట్ పాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ వ్యవసాయం, మత్స్యరంగానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, దేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.  

విక సిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ 

బడ్జెట్ భా రతదేశ అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఉంది.  దేశంలో ఏడుహై స్పీడ్ రైల్వేల నిర్మాణం అందులో మూడు తెలంగాణ రాష్ట్రం నుంచి అనుసంధానించడం అనేది మంచి పరిణామం. ఐదు ప్రాంతీయ వైద్య, విద్యా సంస్థలు, మూడు ఆయుర్వేద సంస్థల ఏర్పాటు, టెక్స్‌టైల్ రం గానికి ఐదు వేల కోట్లు కేటాయించడం ద్వారా చేనేత, వస్త్ర పరిశ్రమకు ప్రా ధాన్యత ఇచ్చింది.   ప్రతి జిల్లా కేంద్రంలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేయడం ద్వారా బాలికల అక్షరాస్యతను, విద్యను పెంచడానికి అవకాశం ఉం టుంది.2026-  సంవత్సరానికి రాష్ట్రాలకు 1.40 లక్షల కోట్ల గ్రాంట్‌ను కేటాయించడం ద్వారా రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యతను చేకూర్చింది. 

శ్రీవాణి, అర్థశాస్త్ర విభాగ అధిపతి,శాతవాహన వర్సిటీ, కరీంనగర్.

రైతుకేదీ ఆర్థిక మద్దతు?

మోదీ ప్రభుత్వం ఆలోచనలు కోల్పోయింది.  2026 కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ సవాళ్లకు ఏ ఒక్క పరిష్కారాన్నీ చూపట్లేదు. బడ్జెట్ లో విధానపరమైన దార్శనికత, రాజకీయ సంకల్పం కొరవడ్డాయి. కనీసం విధాన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా మోదీ ప్రభుత్వం ప్రయత్నించినట్లు కనిపించట్లేదు.  ’మిషన్ మోడ్’ ఇప్పుడు ’ఛాలెంజ్ రూట్’గా తయారైంది, రిఫార్మ్ ఎక్స్ప్రెస్ ఏ ’రిఫార్మ్’ జంక్షన్ వద్ద కూడా ఆగకుండా వెళ్లిపోతుంది.  విధానపరమైన దార్శనికత గానీ, రాజకీయ సంకల్పం అంతకంటే లేకుండా పోయింది.  రైతులు, ఇతర అర్హత గల వర్గాల వారికి ఎటువంటి ఆర్థిక మద్దతు, ఆదాయ భద్రతా ప్రణాళిక కల్పించలేదు.  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ వర్గాలకు ఎటువంటి మద్దతునూ చూపలేదు. ఆర్థిక సంఘం సిఫార్సులపై అధ్యయనం అవసరం గానీ, తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు అవి ఉపశమనం కలిగించవు . సమాఖ్య వ్యవస్థ బలహీనపడింది. 

ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు

నిరుద్యోగం, రైతుల కష్టాలను విస్మరించారు

దేశం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక, సామాజిక సవాళ్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. నిరుద్యోగం, తయారీ రంగం క్షీణత, రైతుల కష్టాలు వంటి కీలక సమస్యలను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ ఘోరంగా విఫలమైంది.  ‘ఉద్యోగాలు లేని యువత, పడిపోతున్న తయారీ రంగం, దేశం నుంచి తరలిపోతున్న పెట్టుబడులు, కుప్పకూలుతున్న కుటుంబ పొదుపు, రైతుల కష్టాలు, పొంచివున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు... వీటన్నింటినీ బడ్జెట్ పట్టించుకోలేదు. దిద్దుబాటు చర్యలకు నిరాకరిస్తున్న ఈ బడ్జెట్, భారతదేశ వాస్తవ సంక్షోభాల పట్ల గుడ్డిగా వ్యవహరిస్తోంది. వృద్ధిని పునరుద్ధరించడానికి, ఉపాధి కల్పించడానికి ఇందులో సరైన సంస్కరణలు లేవు.

కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్‌గాంధీ

కంటికి కనిపిచని లెక్కల చిట్టా

స్టాక్ మార్కెట్ పతనానికి బడ్జెట్టే కారణం. ఇది ‘బీజేపీ బడ్జెట్ ఫలితం. ఆదివారం మార్కెట్ తెరుస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు, అది ఇంకా ఎంత పడిపోతుందన్నదే అసలు ప్రశ్న అని మేము ముందే చెప్పాం‘ . ఈ బడ్జెట్ కేవలం 5 శాతం మంది ప్రజల కోసమే, కమీషన్లు దక్కించుకోవడానికి, బీజేపీ సొంత వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడానికే దీన్ని రూపొందించారు. 

 ‘ఇది బీజేపీ తరహా అవినీతికి కంటికి కనిపించని లెక్కల చిట్టా’. అనియంత్రితంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం సమయంలో పన్ను ఉపశమనం కల్పించకపోవడం ’పన్ను దోపిడీ’ కిందకే వస్తుంది. సంపన్నులకు వ్యాపారం, ప్రయాణాల కోసం పదుల రకాల మినహాయింపులు ఇచ్చి, నిరుద్యోగులకు మాత్రం ’ఆశల ఖాళీ పళ్లెం’ చూపించారు. ఈ బడ్జెట్ వల్ల మధ్యతరగతి ప్రజలు పూర్తిగా మోసపోయినట్లు భావిస్తున్నారు. ఇది తీవ్ర నిరాశాజనకమైన, దారుణమైన బడ్జెట్.

సమాజ్‌వాది పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి, అఖిలేశ్‌యాదవ్

బడ్జెట్.. అబద్ధాల కుప్ప

ఇది విజన్, మిషన్, దిశానిర్దేశం లేని బడ్జెట్. పూర్తిగా అబద్ధాలతో నిండి ఉంది. ఈ బడ్జెట్ ద్వారా కేంద్రం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తోంది. ‘ఈ బడ్జెట్‌కు ఎలాంటి లక్ష్యం లేదు. ఇది పూర్తిగా పేదలు, మహిళలు, రైతులు, యువత, సామాన్యులతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వ్యతిరేకమైనది. విద్యా రంగానికి కేటాయింపులు లేవు. విద్యా సబ్సిడీ, సామాజిక భద్రతా సబ్సిడీ, ఎరువుల సబ్సిడీలను తగ్గించారు. ఇది పూర్తిగా అబద్ధాల కుప్ప’  పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదు.  ‘మా రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదు. జీఎస్టీ రూపంలో మా డబ్బును వారే తీసుకెళ్లి, తిరిగి మేమే ఇస్తున్నట్టు గొప్పలు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని నడిపే నైతిక హక్కు వారికి లేదు’

బెంగాల్ ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ 

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్న 

కేంద్రానికి వేల కోట్ల రూపాయల పన్నులు వెళ్తున్నప్పటికీ నిధులు కేటాయించడంలో కేంద్రం మరోసారి తెలంగాణ పట్ల వివక్షత చూపి రాష్ట్రానికి గుండు సున్న బడ్జెట్ ను కేటాయించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. ఇది పూర్తిగా నిరాశజనకం. రైతులకు, చేనేత కార్మికులకు, యువతకు ఈ బడ్జెట్‌లో ఏ కేటాయింపు లేదు. ఫ్లోరోసిస్ బాధితుల పునరావాసానికి ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్, నిరుద్యోగం, ధరల పెరుగుదల సమస్యలను పరిష్కరించేందుకు బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైల్వే లైన్లు, కోచ్ ఫ్యాక్టరీ, విమానాశ్రయాల అభివృద్ధి, భారత్ ఫ్యూచర్ సిటీ, మెట్రో కారిడార్, నిరుద్యోగం రూపు మాపేందుకు, ఉద్యోగ, ఉపాధి మార్గాలు, కొత్త జాతీయ రహదారులకు బడ్జెట్ లో ఏమాత్రం కేటాయింపులు లేవు. మొత్తానికి ఇది నిరాశాజనకమైన బడ్జెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

- ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

విద్యారంగాన్ని విస్మరించిన బడ్జెట్

కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగాన్ని, యువజనులను పూర్తిగా విస్మరించారు. ఇది విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక బడ్జెట్. విద్యారంగానికి కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించాల్సింది ఉండగా, కేవలం రూ.1,39,289 కోట్లు మాత్రమే కేటాయించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ ఊసే లేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజల, నిత్యవసర వస్తువులపై జీఎస్టీ భారం తగ్గించలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి సరైన నిధులు ఇవ్వలేదు. దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే, యువతకు ఉపాధి కల్పించే నిర్దిష్ట ప్రణాళికలేవీ ఈ బడ్జెట్లో లేవు. కరీంనగర్‌లో ఐఐఐటీ ఏర్పాటు విస్మరించారు. తెలంగాణ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న కక్షపూరిత తీరు అర్థమైంది. 

కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు 

విద్యారంగానికి అన్యాయం

ప్రతీ కేంద్ర బడ్జెట్‌లోనూ విద్యా రంగానికి అన్యాయం జరుగుతున్నది. 12 ఏళ్ల మోదీ పాలనలో విద్యా రంగానికి కేటాయింపులు తగిన మొత్తంలో జరగటంలేదు.ఈ సంవత్సరం 53.5 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్‌లో విద్యకు కేటాయించిన నిధులు కేవలం 1,39,289 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్‌లో 2.6 శాతం మాత్రమే! ఈ నిధులు పెరిగినట్లు కనిపించినప్పటికీ మొత్తం బడ్జెట్‌లో శాతంలో పెరుగుదల లేదు. గత సంవత్సరం బడ్జెట్ 48,21,000,ల కోట్లు కాగా విద్యకు కేటాయించింది 1,28,628 కోట్లు, మొత్తం బడ్జెట్ లో 2.6 శాతం మాత్రమే. బడ్జెట్ కేటాయింపులు లేకుండా బడ్జెట్ ప్రసంగాలు ఎన్ని చేసినా క్షేత్రస్థాయిలో పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య అందని ద్రాక్షగా మిగులుతుంది. 

 అనిల్‌కుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

సార్వత్రిక విద్యకు దూరంగా బడ్జెట్

కేంద్ర  బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు సార్వత్రిక విద్యాసాధన లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. గత సంవత్సరం విద్యకు రూ.1,28,650 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ.1,39,289 కోట్లు కేటాయించారు.  అంకెల్లో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ మొత్తం బడ్జెట్ దామాషాలో తక్కువగానే ఉంది. పెరిగిన ధరలతో పోలిస్తే ఈ బడ్జెట్ ఏమాత్రం సరిపోదు. 

టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి

విద్యాసంస్థల అభివృద్ధికి సరిపోదు

కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన నిధులు తీవ్ర నిరాశ. దేశ భవిష్యత్‌ను నిర్మించే విద్యారంగాన్ని ప్రాధాన్యంగా చూడాల్సిన సమయంలో, కేంద్ర ప్రభుత్వం విద్యను పూర్తిగా పక్కన పెట్టింది. జీడీపీలో విద్యకు 6 శాతం ఖర్చు చేయాలనే లక్ష్యానికి దూరంగా విద్యకు నిధులు కేటాయించారని తెలిపారు. ఫీజుల పెంపు, స్కాలర్షిప్స్ తగ్గింపు వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్న పరిస్థితిలో పేర్కొన్నారు. 

 ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. రజనీకాంత్, టీ.నాగరాజు