6 August, 2026 | 11:59 AM

సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక మైలురాయి

06-08-2026 10:41 AM

మంచిర్యాల: సింగరేణి చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశాలోని సింగరేణి నైనీ గని నుంచి తొలి బొగ్గు రైల్వే రేకు మంచిర్యాల జిల్లా(Mancherial District) జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క  ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి, అధికారులు, కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP) కోసం కేటాయించిన 'నైనీ కోల్ బ్లాక్' నుంచి మొట్టమొదటి రైల్ రేక్ ద్వారా బొగ్గు వస్తుండటం మనందరికీ గర్వకారణం అన్నారు.

సింగరేణి చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో, అభివృద్ధిలో సింగరేణి పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణిని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. సింగరేణిని ప్రపంచంలోనే అత్యుత్తమ మైనింగ్ సంస్థలతో పోటీపడేలా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఒడిశా నుంచి చేరుకున్న తొలి బొగ్గు రైల్వే రేకుకు ఎస్టీపీపీ ప్రాంగణంలో సంస్థ డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, ఎం. తిరుమల రావు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడీ, జీఎం, గుర్తింపు మరియు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, అధికార సంఘ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.