6 August, 2026 | 12:20 PM

ఆచార్య జయశంకర్ తెలంగాణకు దిక్సూచి

06-08-2026 11:09 AM

జయశంకర్ జయంతి సందర్భంగా కేటీఆర్, హరీశ్ నివాళులు

హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతిని(Professor Jayashankar Jayanti) పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన చేసిన జీవితకాల నిబద్ధతను, కృషిని స్మరించుకుంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), మాజీమంత్రి హరీష్‌రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తన జీవితమంతా రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యం కోసం అంకితం చేసిన జయశంకర్‌ తెలంగాణకు మార్గదర్శి, సైద్ధాంతిక స్ఫూర్తికి మూలమని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధినేత, ఉద్యమనేత కే చంద్రశేఖర్‌రావుతో జయశంకర్‌కు ఉన్న సన్నిహిత అనుబంధాన్ని, తెలంగాణ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడంలో, ఉద్యమ సమయంలో ప్రజలను జాగృతం చేయడంలో ఆయన పాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. 

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టి ఆయన సేవలను గౌరవించిందన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీక జయశంకర్ అని, రాష్ట్ర సాధన కోసం ఆయన జీవితాంతం పోరాడారని హరీశ్ రావు కొనియాడారు. భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా జయశంకర్‌ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ పేరు పెట్టడంతోపాటు ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన బాటలో నడుస్తూ, ఆయన ఆశయాలను అనుసరించడమే తెలంగాణ సిద్ధాంతకర్తకు నిజమైన నివాళి అన్నారు.