డబ్బా పాలు వద్దు.. తల్లి పాలే ముద్దు..!
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): డబ్బా పాలు వద్దు.. తల్లి పాలే ముద్దు అనే నినాదంతో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల(World Breastfeeding Week) సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil), ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శిశువు పుట్టిన తొలి అరగంటలోపే తల్లిపాలు ఇవ్వాలని, తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. ముర్రు పాలు (కొలస్ట్రం) శిశువుకు తొలి టీకా వంటివని, రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించాలని తెలిపారు.
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, తల్లుల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగిన ప్రతి నవజాత శిశువుకు తొలి గంటలోనే తల్లిపాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో తల్లిపాల బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఇంటికి "డబ్బా పాలు వద్దు.. తల్లి పాలే ముద్దు" అనే సందేశాన్ని చేరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






