26 July, 2026 | 1:59 AM

ట్రంప్‌నకు మరో షాక్

26-07-2026 12:00 AM
  1. హెచ్1 బీ వీసా ఫీజు లక్ష డాలర్ల పెంపుపై స్టే నిరాకరణ
  2. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకోలేరన్న కోర్టు

వాషింగ్టన్, జూలై 25: హెచ్1బీ వీసాల ఫీజు లక్ష డాలర్లకు పెంపు నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోమారు షాక్ తగిలింది. ఫీజులు చట్టబద్ధం కాదంటూ దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు అప్పీల్స్ కోర్టు నో చెప్పింది. దీనిపై స్టే ఇవ్వకుంటే అమెరికాకు వచ్చే నష్టం ఏంటో తెలియజేయడంతో ట్రంప్ యంత్రాంగం విఫలమైందని స్పష్టం చేసింది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా ట్రంప్ దీనిపై నిర్ణయం తీసుకోలేరని స్పష్టం చేసింది.

విదేశాల్లో ఉండి అమెరికా తాత్కాలిక వలస వీసా అయిన హెచ్-1బీకి ఎంపికైన వారు లక్ష డాలర్ల ఫీజును చెల్లించాలని గత సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని సవాలు చేస్తూ 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన అమెరికా జిల్లా న్యాయమూర్తి లియో సొరొకిన్ లక్ష డాలర్ల ఫీజు చట్ట విరుద్ధమని ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకపోవడంతో దానిని చట్ట విరుద్ధ పన్నుగా పరిగణిస్తున్నామని తీర్పు చెప్పారు.

దీంతో ట్రంప్ యంత్రాంగం అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ట్రంప్‌నకు షాక్ ఇచ్చింది. కాగా సాధారణంగా వీసాల కోసం అయ్యే ఖర్చును సంస్థలే భరిస్తాయి. ఇందుకోసం 2వేల నుంచి 5వేల డాలర్ల వరకు ఖర్చవుతుండేది. ట్రంప్ నిర్ణయంతో విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా కంపెనీలు అమెరికన్లు నియమించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫీజును పెంచారు. దీంతో భారతీయులపై పెను ప్రభావం పడింది.