అంగవైకల్యం శరీరానికే.. సంకల్పానికి కాదు
- పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమే....
- ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్
మహబూబాబాద్, మే 20 (విజయక్రాంతి): దివ్యాంగత శరీరానికే పరిమితమని, తమ సంకల్పానికి కాదని పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైన సాధించవచ్చని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ సహకారంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ దివ్యాంగుల జీవితం సులభతరం కావడానికి అవసరమైన ట్రై సైకిళ్ళు, వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్, వినికిడి యంత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమ పథకాలను దివ్యాంగులకు, అణగారిన వర్గాలకు చేరవేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వారికి సమాజంలో సమాన అవకాశాలు కల్పించడంలో ఇటువంటి పరికరాలు ఎంతో దోహదపడతాయన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని నిరుపేదలకు, దివ్యాంగులకు అందుబాటులో ఉండడమే తమ ప్రధాన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గూగులోత్ జ్యోతి రమేష్, జిల్లా విద్యాధికారి ఏ. సత్యనారాయణ మూర్తి, స్థానిక వార్డు కౌన్సిలర్ కాటా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






