16 July, 2026 | 3:24 PM

అమరావతిపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం

03-07-2024 05:35 PM

అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి అని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని నగరం ప్రాముఖ్యతను, అభివృద్ధికి చేస్తున్న కృషిని ఎత్తిచూపుతూ ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గతంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న అమరావతి నగర చరిత్రను వివరించిన చంద్రబాబు, రాజధాని పేరును కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని వెల్లడించారు. అమరావతికి ప్రధాని మోడీ ఫౌండేషన్‌ వేశారని గుర్తుచేశారు. శాతవాహనుల కాలంలో అమరావతి కేంద్రంగా పాలన జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులలో పూజలు చూసి, అన్ని గ్రామాల నుంచి నీరు, మట్టి తెచ్చి, అమరావతికి భూమి పూజ చేసామని ఆయన తెలిపారు. గత 5 ఏళ్ళలో, వీళ్ళు అమరావతిని కదిలించలేక పోయారు అంటే, ఆ మట్టికి ఉండే విశిష్టత అది అని సీబీఎన్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో అత్యంత సమాన దూరంలో ఉన్న ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి ఇది కీలకమైన అంశం అని పేర్కొంటూ అమరావతి వ్యూహాత్మక స్థానాన్ని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో తనకున్న అనుభవంతో సమాంతరంగా చిత్రీకరించారు. రాజధాని ప్రాజెక్ట్ కోసం తమ భూములను ఇష్టపూర్వకంగా ఇచ్చిన రైతులు చేసిన సహకారాన్ని హైలైట్ చేశారు. ప్రతిపక్ష నేతపై విరుచుకుపడిన చంద్రబాబు రాజధాని స్థలం విషయంలో జగన్ తన మునుపటి వైఖరిని వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. అమరావతి విశాలమైన నదీ తీరం, గోదావరి, కృష్ణా నదుల ఉనికి వంటి ప్రత్యేక ప్రయోజనాలను ఆయన ప్రస్తావించారు. ఎటు చూసిన సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి అన్న చంద్రబాబు నాయుడు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా దీన్ని వ్యతిరేకించరన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాది కూడా దీన్ని ఒక్పుకుని తీరతారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.