అధికారం కోసమే మోసపూరిత హామీలు
హైదరాబాద్: డిసెంబర్ 9లోపు రూ. 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గుర్తుచేశారు. ఇప్పుడు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటున్నారని రఘునందన్ రావు హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ఇప్పుడేమో కమిటీ వేసి ఎవరికి ఇవ్వాలో.. ఇవ్వకూడదో పరిశీలిస్తారంటూ సమయం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోపైనా రుణమాఫీ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి వేధింపులతోనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.. ఇవ్వట్లేదని మండిపడ్డారు. అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారని రఘునందన్ విమర్శించారు.






