దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 24( విజయ క్రాంతి,);ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండలాధికారి లోకేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్ లతో కలిసి దరఖాస్తుదారుల నుండి అర్జీలను స్వీకరించారు.
జైనూర్ మండలం నందు నాయక్ తండాకు చెందిన జాదవ్ సుజాత తన భర్త మరణించినందున ఆయన పేరిట ఉన్న భూమిని తన పేరిట విరాసత్ చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జిల్లా కేంద్రానికి చెందిన పెంద్రం సత్యవతి తనకు రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దహేగాం మండలం లగ్గాం గ్రామానికి చెందిన కొండ్ర భాస్కర్ గౌడ్ తాను గీత కార్మికుడిని అయినందున లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
తిర్యాణి మండలం చెలిమెల కోలాంగూడ గ్రామానికి చెందిన టేకం గంగారం తన పట్టా భూమిని ఇతరులు కబ్జా చేసినందున తగు విచారణ చేసి నాకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైనూర్ మండల కేంద్రంలోని ఎస్.సి. కాలనీకి చెందిన దుదనే శ్రీమంత తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
కాగజ్ నగర్ పట్టణం రిక్షా కాలనీకి చెందిన ఫర్హీన్ సుల్తానా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. సిర్పూర్ టి మండల కేంద్రానికి చెం దిన మహమ్మద్ అమీనొద్దీన్ తాను బోరింగ్ మెకానిక్ పని చేస్తున్నానని, తనకు రావలసిన 4 నెలల వేతనాన్ని ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. రెబ్బెన మండ లం జక్కలపల్లి గ్రామస్తులు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థా యిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, గత ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల సంబంధిత వివ రాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






