calender_icon.png 24 November, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు కోడ్ లను రద్దు చేయాలి

24-11-2025 10:44:46 PM

ఏఐటియుసి ఆధ్వర్యంలో దశల వారి ఆందోళనలు 

బ్రాంచ్ కార్యదర్శి రాంగోపాల్

మణుగూరు (విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రాంగోపాల్ డిమాండ్ చేశారు. సోమవారం పీవీ కాలనీ యూనియన్ కార్యాలయం కేఎల్ మహేంద్ర భవన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ ప్రభుత్వం భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కాలరాస్తు, వాటి స్థానంలో నాలుగు కోడ్లను ప్రవేశపెట్టిందని దీని వల్ల  కార్మిక వర్గం అంతా తీవ్ర నష్టాన్ని, హక్కులను కోల్పోతున్నారన్నారు. కార్మిక వర్గాలు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానం, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ రంగ సంస్థల మనుగడ, కార్మిక సంక్షేమం దెబ్బతింటాయని, కార్మిక సంఘాల ఏర్పాటు, సమ్మె హక్కు, ధర్నాలు, నిరసనలు తెలియజేసే హక్కులు హరించకపోయే ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందని దీనిని అన్ని కేంద్ర కార్మిక సంఘాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, శ్రమ దోపిడి జరిగే అవకాశాన్ని బహుమతిగా ఇచ్చినట్లు అయిందని ఎద్దేవా చేశారు. సింగరేణిలో కూడా ఈ కోడ్ ల వలన కార్మికవర్గం తమ హక్కులను నష్టపోతుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా, తిరిగి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ ఈనెల 25న సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్స్, డిపార్ట్మెంట్ల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయాలని, నవంబర్ 26వ తేదీ జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్నం 11 గంటలకు వినతి పత్రాలు అందజేయాలని, అదే రోజు తిరిగి సాయంత్రం 3 గంటలకు సింగరేణి ఏరియాలోని అన్ని జిఎం ఆఫీసుల ముందు  నిరసనలు తెలి యజేయాలని పోరాట కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

ఈ  నిరసన, పోరాట కార్యక్రమాలకు కార్మిక వర్గం అంతా ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తిరిగి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించే వరకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని కార్మికులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎం.వి. రాంనరసయ్య, ఆఫీస్ బేరర్స్ ఆవుల నాగరాజు, ఆదర్ల సురేందర్, పిట్ సెక్రటరీ శనిగరపు కుమారస్వామి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కౌన్సిల్ మెంబర్స్, పిట్ కమిటీ, మైన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.