10 August, 2026 | 2:21 PM

పీఎస్‌యూలు ప్రత్యేకమా?

26-05-2024 01:09 AM

కేంద్రప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ తరుచూ ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్తున్నారు. దేశంలో అన్నీ, అందరూ సమానమేనని పదేపదే అంటున్నారు. కానీ, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల వద్దకు వచ్చేసరికి తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. అది ఎంతటి తీవ్రమైనదంటే కోట్లకొద్ది ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినా ఏమీ చేయలేనంత.. అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడినా శిక్షించలేనంత. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) సంస్థ నిర్ణయంతో సరిగ్గా ఇదే జరుగుతున్నది. మీరు ఆర్‌వోసీ వద్ద ఓ కంపెనీని రిజిస్టర్ చేశారంటే కంపెనీకి సంబంధించిన వార్షిక బ్యాలెన్స్ షీట్‌ను ఆ సంస్థకు తప్పనిసరిగా సమర్పించాలి.

మూడేండ్లవరకు బ్యాలెన్స్ షీట్ సమర్పించటంలో విఫలమైతే ఆర్‌వోసీ కఠిన చర్యలు తీసుకొంటుంది. కంపెనీ డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించటమే కాకుండా భారీగా జరిమానా విధిస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు తమ వార్షిక బ్యాలెన్స్ షీట్లను ఆర్‌వోసీకి ఏటా సమర్పించాల్సిందే. ఆ బ్యాలెన్స్ షీట్లను ఆర్‌వోసీ ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. ఇందులో ఆయా కంపెనీల ఏజీఎం వివరాలు, డైరెక్టర్ల వివరాలు, సదరు సంస్థ ప్రభుత్వ, ఆర్‌వోసీ నిబంధనలు పాటిస్తున్నదా? లేదా అనే విషయాలు ఉంటాయి. ఆయా రంగాల నిపుణులు, రాజకీయ నేతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు సదరు కంపెనీల లావాదేవీలను పరిశీలించి, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉంటుంది. 

కంపెనీలు వార్షిక లావాదేవీల నివేదికలను మూడేండ్లలోపు సమర్పించటంలో విఫలమైతే ఆర్‌వోసీ విధించే జరిమానాల్లో ప్రధానమైనది ఆ కంపెనీల డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించటం. అయితే, కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ) ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. వార్షిక నివేదికలను సమర్పించకుంటే సంస్థ డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించే నిబంధన నుంచి పీఎస్‌యూల డైరెక్టర్లకు 2015లో ఆర్‌వోసీ సడలింపు ఇచ్చింది. సాధారణంగా పీఎస్‌యూల డైరెక్టర్లంతా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులే ఉంటారు.

ఈ నిర్ణయంతో దాదాపు అన్ని పీఎస్‌యూలు తమ వార్షిక బ్యాలెన్స్ షీట్లను సమర్పించటంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. నివేదికలు ఇవ్వకున్నా అడిగేవాడు లేకపోవటంతో చాలా సంస్థలు రెండు నుంచి 8 ఏండ్ల వరకు ఆలస్యంగా బ్యాలెన్స్ షీట్లను ఆర్‌వోసీకి సమర్పిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఏం జరుగుతున్నదో.. వాటి ఆర్థిక పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియకుండా పోయింది.

ఆయా సంస్థలు నష్టాల్లో ఉన్నా.. ఏవైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరిగినా ప్రభుత్వ పెద్దలు వాటిని ఐదేండ్ల తర్వాత సరిచేయటం దాదాపు అసాధ్యం. ఇది ఎలా ఉంటుందంటే మృతదేహానికి వైద్యం చేసినట్టుగా ఉంటుంది. వన్ నేషన్ వన్ రూల్, వన్ నేషన్ వన్ పోల్ అంటున్న బీజేపీ ప్రభుత్వం మరి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య ఈ తేడా ఎందుకు చూపిస్తున్నది? 

మూడేండ్లపాటు కంపెనీ వార్షిక బ్యాలెన్స్ షీట్ సమర్పించకపోతే ప్రైవేటు కంపెనీ డైరెక్టర్‌ను అనర్హుడిగా ప్రకటించి.. పీఎస్‌యూ డైరెక్టర్‌పై ఏ చర్యలూ తీసుకోకపోవటం ఏ విధమైన న్యాయం? ఒకే నేరానికి రెండురకాల న్యాయాలెలా ఉంటాయి? ఆర్‌వోసీ నిబంధనల్లో చేసిన ఈ చిన్న మార్పు వేలకోట్ల రూపాయల ప్రజాధనం నష్టపోయేలా చేస్తున్నది. ఉదాహరణకు ఒక పీఎస్‌యూలో భారీ నష్టాలకు ఆ కంపెనీ డైరెక్టర్లే బాధ్యులు అనుకొందాం. ఆ సంస్థ ఆరేండ్ల తర్వాతనో, ఏడేండ్లకో తన బ్యాలెన్స్ షీట్ ఆర్‌వోసీకి సమర్పించింది అనుకొందాం.

అప్పుడు ఎవరిని శిక్షిస్తారు? ఎలా శిక్షిస్తారు? పీఎస్‌యూలు సమయానికి తమ వార్షిక బ్యాలెన్స్ షీట్లను సమర్పిస్తేనే అందులో జరిగే అక్రమాలను, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు వీలవుతుంది. ఎవరైనా పీఎస్‌యూ డైరెక్టర్, లేదా డైరెక్టర్లు అసమర్థులుగా తేలితే, వారి స్థానంలో సమర్థులైన డైరెక్టర్లను నియమించేందుకు వీలవుతుంది. ఒకవేళ డైరెక్టర్లు వాళ్ల ఆర్థి అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియకుండా దాచాలని ప్రయత్నించినా, ప్రభుత్వం వెంటనే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే శిక్షించటం సాధ్యమవుతుంది. కేంద్రప్రభుత్వం ఈ వివక్షను తొలగించి ప్రైవేటు, ప్రభుత్వ రంగాలకు సమ ప్రాధాన్యం కల్పించేందుకు ఇదే సరైన సమయం. 


సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి