10 August, 2026 | 1:09 PM

గాలిదుమారం.. ఆగమాగం

26-05-2024 01:11 AM

రాజన్న సిరిసిల్ల/ జగిత్యాల/ కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 25 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా శనివారం గాలి దుమారంతో కూడిన వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో రేకుల షెడ్డు ఎగిరిపడి చంద్రయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కొండాపూర్, బావుసాయిపేటలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగా యి. మామిడిపల్లిలో చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడింది. జగిత్యాల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. దమ్మన్నపేటలో గాలిదుమారానికి నాలుగు ఇండ్లపై పైకప్పులు లేచికిందపడ్డాయి. రాగోజీపేట, మైతాపూర్‌లోని రెండు తాటిచెట్లపై పిడుగు పడి మంటలు వ్యాపించాయి. మల్లాపూర్ మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ సమీపంలో పిడుగుపడగా భయంతో గుండెపోటు వచ్చి ఖాదిర్ అనే వ్యక్తి మృతిచెందాడు. కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో గాలిదుమారానికి చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పిడుగుపడి ఈత వనం దగ్ధమైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి) మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కేశవపట్నంలో పిడుగు పడి రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి.