విగ్రహాలే బీసీల సాధికారతా?
ఈ దేశంలో కులం ఒక సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు, అది శతాబ్దాలుగా కుల వివక్ష, అంటరానితనం, అసమానత, భూమి, విద్య, వృత్తి, ఆస్తి, అధికారం, సామాజిక గౌరవం, ఆర్థిక స్థితి, భావజాలం, రాజకీయ ప్రాతినిధ్యాలను ప్రభావితం చేస్తూ వస్తున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో బీసీల అభివృద్ధి ప్రశ్నను కేవలం సంక్షేమ పథకాలతోనో, కుల నేతల జయంతులు, వర్ధంతులు, విగ్రహాలు, స్మారకాల నిర్మాణాలతోనో కొలవలేం. మహనీయుల విగ్రహాలు, స్మారకాలు బీసీల చారిత్రక గుర్తింపునకు, ఆత్మగౌరవానికి ప్రతీకలే. కానీ ఆ సంకేత గుర్తింపునే అభివృద్ధికి ప్రత్యామ్నాయంగా చూపుతూ విద్య, ఉపాధి, ఆర్థిక వనరులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అసలు సమస్యలను పక్కకు నెట్టే రాజకీయమే అసలు సంక్షోభం.
జ్యోతిరావు ఫూలే సత్యశోధక ఉద్యమం ద్వారా సామాజిక ఆధిపత్యాన్ని ప్రశ్నించినప్పటి నుంచి నేటి సామాజిక న్యాయ రాజకీయాల వరకు బీసీల పోరాటం కేవలం గుర్తింపు కోసం సాగలేదు. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా సమానత్వం కోసం, అధికార భాగస్వామ్యం కోసం, విద్య కోసం, అంధవిశ్వాసాలకు వ్యతిరేకమైన హేతుబద్ధ భావజాలం కోసం సాగింది. బీసీ ఉద్యమం తన ఉనికిని గుర్తించమని మాత్రమే కోరలేదు; సమాజంలో తమకు సమాన హక్కులు, అవకాశాలు, ప్రాతినిధ్యం, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేసింది. బీసీ రాజకీయాల చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అది కేవలం కుల గుర్తింపు కోసం జరిగిన ఉద్యమం కాదు; గుర్తింపు నుంచి హక్కుల దిశగా, హక్కుల నుంచి ప్రాతినిధ్యం దిశగా సాగిన సామాజిక పోరాటం. కానీ, నేటి రాజకీయాల్లో ఈ ప్రయాణం మళ్లీ సంకేత రాజకీయాల దగ్గరే నిలిచిపోతున్నదా? అన్నదే ప్రధాన ప్రశ్న.
మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయ డం తప్పు కాదు. అయితే విగ్రహాలు, స్మారక భవనాల నిర్మాణంలో, వాటి పరిమాణంలో ఒక కులం మరో కులంతో పోటీపడే ధోరణి కనిపిస్తే, అది సామాజిక న్యాయాన్ని కాకుండా కేవలం కులతత్వాన్నే ప్రతిబింబిస్తుంది. సమస్య ఎక్కడ ప్రారంభమవుతుందంటే, విగ్రహం నిర్మించిన తర్వాత ఆ మహనీయుడి ఆశయాలను అమలు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం, రాజకీయ పార్టీలు మరచిపోయినప్పుడు. కుల నేత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒక వర్గానికి గుర్తింపు లభించవచ్చు. కానీ, ఆ వర్గంలోని పిల్లలకు నాణ్యమైన విద్య లభించిందా? యువతకు ఉద్యోగాలు వచ్చాయా? సంప్రదాయ వృత్తులకు ఆధునిక మార్కెట్ లభించిందా? చిన్న వ్యాపారులకు రుణాలు అందాయా? రాజకీయ నిర్ణయాల్లో ఆ వర్గానికి తగిన భాగస్వామ్యం వచ్చిందా? ఇవే అసలు ప్రశ్నలు. విగ్రహాలతో పాటు కులసంఘాల పేరుతో నిర్మించే స్మారక భవనాలకు ఇదే సూత్రం వర్తిస్తుంది.
బీసీ అనేది ఒకే సామాజిక, ఆర్థిక స్థితి కలిగిన ఏకరూప సమూహం కాదు. దాని పరిధిలో అనేక వృత్తి, ఉపకుల, ప్రాంతీయ, ఆర్థిక వర్గాలు ఉన్నాయి. రాజకీయంగా బలమైన వర్గాల నుంచి అత్యంత వెనుకబడిన కులాలు, సంచార, అర్ధసంచార వర్గాల వరకు వారి పరిస్థితుల్లో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అందువల్ల ‘బీసీల అభివృద్ధి’ అని ఒకే మాటతో సరిపెట్టడం శాస్త్రీయ విధానం కాదు. బీసీలలో ఎవరు ఎంత వెనుకబడి ఉన్నారు? ఎవరి సంప్రదాయ వృత్తులు క్షీణించాయి? ఎవరికి భూమి, ఉపాధి, రుణం, మార్కెట్ సదుపాయాలు అందడం లేదు? ఎవరి రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిందే.
సంప్రదాయ వృత్తుల పరిస్థితి దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ. నేత, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, మత్స్యకారులు, గౌడ, మంగలి, వడ్డెర, మేదర వంటి అనేక వృత్తి సమూహాలు పారిశ్రామికీకరణ, యాంత్రీకరణ, మార్కెట్ పోటీ, పెట్టుబడి, రుణాల కొరత వంటి కారణాలతో తీవ్ర జీవనాధార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఇక్కడే బీసీల ఆర్థిక సాధికారత పేరుతో ప్రభుత్వాలు చేస్తున్న కేటాయింపులు, వాటి అమలును ప్రశ్నించాలి. బీసీలకు పథకాలు ప్రకటించడం ఒక దశ మాత్రమే. ఎంత కేటాయించారు? ఎంత విడుదల చేశారు? ఎంత ఖర్చు చేశారు? ఎంతమంది లబ్ధిదారులకు చేరింది? ఎంతమందికి స్థిరమైన ఆర్థిక ప్రయోజనం చేకూరింది? అనే ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అవసరానికి తక్కువగా నిధులు కేటాయించడం, కేటాయించిన మొత్తాన్ని పూర్తిగా విడుదల చేయకపోవడం, విడుదలైన నిధుల్లోనూ వాస్తవ లబ్ధిదారులకు తగినంతగా చేరకపోవడం కొనసాగితే కాగితంపై ఉన్న బడ్జెట్ సామాజిక సాధికారతగా ఎలా మారుతుంది?
బీసీల అభివృద్ధిలో మరో కీలకమైన ప్రశ్న రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించినది. జనాభాలో ఉన్న వాటా అధికార నిర్మాణంలో ఎంతగా ప్రతిబింబిస్తోంది? చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో, పరిపాలనా స్థానాల్లో, విధాన నిర్ణయాల్లో వారి భాగస్వామ్యం ఎంత? బీసీలలోనే అత్యంత వెనుకబడిన వర్గాలకు ఆ భాగస్వామ్యం ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండా బీసీల అభివృద్ధి గురించి మాట్లాడటం అసంపూర్ణం. అందుకే కులగణన ఒక ఎన్నికల నినాదంగా కాకుండా విధాన నిర్మాణానికి ఆధారంగా మారాలి. జనాభా ఎంత అన్నది తెలుసుకోవడంతో పాటు, ఉపకులాల విద్యాస్థాయి, వృత్తి, ఆదాయం, ఉపాధి, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం, రాజకీయ భాగస్వామ్యం వంటి అంశాలను అధ్యయనం చేసినప్పుడే వనరుల పంపిణీకి శాస్త్రీయ పద్ధతి రూపొందుతుంది.
రిజర్వేషన్లను కూడా ఇదే దృష్టితో చూడాలి. రిజర్వేషన్ ప్రభుత్వ సంక్షేమ పథకం కాదు; సామాజిక వెనుకబాటుతనం, వివక్ష, తగిన ప్రాతినిధ్యం లేకపోవడానికి రాజ్యాంగపరమైన పరిష్కారం. అందుకే రిజర్వేషన్లను ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి సంక్షేమ చర్యలకు ప్రత్యామ్నాయంగా చూపడం సరికాదు. రిజర్వేషన్లు కొనసాగాలి; అదే సమయంలో ప్రతి పౌరుడికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందాలి. ఒకటి ప్రాతినిధ్య హక్కును రక్షిస్తే, మరొకటి సామాజిక అవకాశాలను విస్తరిస్తుంది.
కుల ఆధారిత వివక్ష విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. కుల వివక్షను వ్యక్తుల మధ్య జరిగే చిన్నపాటి సామాజిక విభేదంగా చూడటం ప్రమాదకరం. కుల వివక్ష సమాజాన్ని అంతర్గతంగా విభజించి, దేశ సమగ్రతను కూడా బలహీనపరుస్తుంది. ఈ కుల తత్వం అగ్రవర్ణాలకే పరిమితం కాదు; బీసీలతో సహా అన్ని కులాల్లోనూ ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉంటుంది. బలమైన ఉపకులాలు బలహీనమైన ఉపకులాలపై చూపే ఆధిపత్యం కూడా అందులో భాగమే. కాబట్టి బీసీల అభివృద్ధి అంటే కేవలం బీసీలకు రిజర్వేషన్లు, వనరులు కల్పించడం కాదు; బీసీల్లో అంతర్గతంగా ఉన్న కుల ఆధిపత్యాన్ని కూడా ఎదుర్కొంటూ, మొత్తం కుల వ్యవస్థ నిర్మూలన దిశగా సాగే విస్తృత సామాజిక న్యాయ ప్రాజెక్టులో భాగంగా దీన్ని చూడాలి.
బీసీల అభివృద్ధికి కావాల్సింది కేవలం సబ్సిడీలే కాదు; గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నత విద్య, వృత్తి విద్య, సాంకేతిక నైపుణ్యాలు బలోపేతం కావాలి. యువతకు రుణాలు, పెట్టుబడి, ప్రారంభ వ్యాపార నిధులు అందించాలి. సంప్రదాయ వృత్తులకు ఆధునిక సాంకేతికత, మార్కెట్ అవకాశాలు కల్పించాలి.
విగ్రహం ఎత్తు పెరగడం కంటే సమాజంలోని పిల్లల విద్యాస్థాయి పెరగాలి. జయంతి వేడుకల ఘనత కంటే యువతకు అందే అవకాశాలు పెరగాలి. కులం పేరుతో ఓట్లు అడిగే రాజకీయాల కంటే కులం ఆధారంగా ఏర్పడిన అసమానతలను తొలగించే విధానాలు పెరగాలి.
బీసీలకు కావాల్సింది సంకేత గుర్తింపు మాత్రమే కాదు; వనరుల్లో వాటా, అవకాశాల్లో సమానత్వం, రాజకీయ ప్రాతినిధ్యంలో భాగస్వామ్యం, నిర్ణయాధికారంలో స్థానం, కుల ఆధారిత వివక్ష నుంచి విముక్తి. వీటిని సాధించే రాజకీయమే నిజమైన బీసీ సాధికారతకు దారి. లేకపోతే విగ్రహాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది; కానీ వాటి నీడలో నిలబడే తరాల జీవితాలు మాత్రం మారవు.
వ్యాసకర్త: సత్యశోధక మహాసభ ప్రతినిధి






