రేయింబవళ్లు కిక్కే కిక్కు!
వనపర్తి జిల్లాలో జోరుగా ‘బెల్టు దందా’
అధిక ధరలకు క్వార్టర్లు, బీర్ల విక్రయం
అరకొరగా ఎక్సైజ్‌శాఖ దాడులు
నామమాత్రంగా మద్యం స్వాధీనం
వనపర్తి మే 9 (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో ‘బెల్టు దందా’ మూడు పూవులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా 24x7 మద్యం ఏరులై పారుతున్నది. ఎక్కడపడితే అక్కడ దొరుకుతుండడంతో మందుబాబులు ఎక్కువ ధర పెట్టి మరీ మద్యం కొనుగోలు చేస్తున్నారు. అందినకాడికి మద్యం తాగి జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. వైన్ షాపు యాజమానులు ఎమ్మార్పీ ధరకు మద్యాన్ని విక్రయిస్తుంటే బెల్టు షాపు నిర్వాహకులు ఒక్కో క్వార్టర్‌కు రూ.30 చొప్పున, బీరుకు రూ.20 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. పండుగలు, బంద్ రోజుల్లో ఈ ధర మరింత పెరుగుతుండటం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ముందు రోజు మద్యం షాపుల బంద్ ప్రకటించిన నేపథ్యంలో బెల్టు షాపు దుకాణదారులు ఇప్పటికే భారీగా మద్యం స్టాక్ పెట్టుకున్నట్లు సమాచారం.
జిల్లాకేంద్రంలో ఎక్కువ..
బెల్టు షాపుల నిర్వహణపై ఇటీవల వనపర్తికి చెందిన కొందరు యువకులు ఎస్పీ రక్షితా కే మూర్తికి ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిబ్బం ది, పోలీసులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టారు. బెల్టుషాపుల్లో అరకొరగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కొన్నిరోజులకు షరా మామూలే అన్నట్లు బెల్టుషాపు యజమానులు తిరిగి దందా ప్రారంభించారు. వారికి మద్యం అందించే వైన్ షాపు నిర్వాహకులు ముందుగానే ఎక్సైజ్‌శాఖ దాడులపై సమాచారం అందిస్తుండడంతో బెల్టుషాపు నిర్వాహకులు తప్పించు కు తిరుగుతున్నారు. జిల్లాకేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం సమీపంలోని బెల్టు షాపుల్లో జోరుగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రికి వచ్చిన కొందరు వ్యక్తులు మద్యం తాగి వైద్యాధికారులతో పాటు వైద్యసిబ్బందితో వాగ్వాదా నికి దిగుతున్నారు. దీనిపై వనపర్తి ఎక్సైజ్‌శాఖ సీఐ వెంకట్‌రెడ్డిని వివరణ కోరగా.. ప్రతిరోజు బెల్టుషాపులపై దాడులు చేస్తున్నామని సమాధానమిచ్చారు. ఎవరైనా బెల్టు షాపుల్లో మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే ఎక్సైజ్‌శాఖకు సమాచారం అందించాలని సూచించారు.






