ఫీజు అడిగితే క్రిమినల్సా?
- వారు క్రిమినల్స్ కాదు.. ఇన్నోవేటర్లు
- ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు హేయం
- ‘జెన్ జీ’ని అవమానించడమే
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
- సీఎం క్షమాపణ చెప్పాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ అడుగుతున్న విద్యార్థులను క్రిమినల్స్‌తో పోల్చడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అని ప్రస్తావించడం సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. వారు క్రిమినల్స్ కాదు.. ఇన్నోవేటర్లని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ‘జెన్ జీ’ని అవమానించేలా ఉన్నాయన్నారు.
రెండున్నరేళ్ల కాలంలో సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఏం చేశాడో చెప్పాలన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వయంగా పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్‌రెడ్డి.. ఇంజనీరింగ్ విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.
‘హైదరాబాద్ ఐటీ కేంద్రంగా ప్రపంచ ఖ్యాతిని పొందడంలో ఇక్కడి ఇంజనీరింగ్ విద్యార్థుల కృషిలేదా? అంతర్జాతీయ ఐటీ, నిర్మాణ, మెకానికల్ కంపెనీల్లో ఉన్నతస్థానాల్లో ఉండటం వాస్తవం కాదా?’ అని మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో వీకెండ్ క్లాసులో నేర్చుకున్న రెండు పదాలను వాడేద్దామనే ప్రయత్నంలో ‘జెన్- జీ’ని అవమానిస్తున్నాననే విషయాన్ని సీఎం మర్చిపోయారని విమర్శించారు.
తెలిసీతెలియని పదాలను వాడి తానేదో మేధావినని నిరూపించుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. రెండున్నరేళ్ల తర్వాత హఠాత్తుగా నిద్రనుంచి మేల్కొని.. ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ‘జెన్-జీ’ ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించొద్దని హితవు పలికారు.
కేసీఆర్‌దీ ఇదే తీరు..
2015లో నాటి సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలను తక్కువ చేస్తూ అసెంబ్లీ వేదికగా కించపరిచేలా మాట్లాడారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులవి వానాకాలం చదువులని విమర్శించారని, తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నా ఇంజినీరింగ్ విద్యలో మార్పుకోసం కేసీఆర్ ప్రయత్నించలేదన్నారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి పాలనలో 12 ఏళ్లుగా విద్యావ్యవస్థ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైందంటే.. వారు ఎంత గొప్పగా పనిచేశారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి గతంలో కూడా ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తే.. ‘తమాషాలు చేస్తే తాట తీస్తాం’ అంటూ తన స్థాయిని మరిచి మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం విద్యారంగానికి కేటాయిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. వాగ్దానాన్ని అటకెక్కించారని విమర్శించారు.
విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు : రాంచందర్‌రావు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’అని ప్రస్తావించడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, తక్షణమే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ దరఖాస్తులు నింపడం కూడా రాదని ఇటీవల హేళన చేసిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు వారిని ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ నోరుపారేసుకోవడం అహంకార పూరిత వైఖరికి నిదర్శనమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో గతంలో కూడా సీఎం రేవంత్‌రెడ్డి కళాశాలల యాజమాన్యాలను బెదిరించారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం చూస్తుంటే రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఉన్నత చదువులు చదవకూడదని, ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులుగానే ఉండిపోవాలని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు, సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.






