10 March, 2026 | 12:42 PM

ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?

09-03-2026 01:18 AM

బెజ్జంకి, మార్చి8: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని మానకొండూరు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిమవ్యక్తం చేశారు. ఆదివారం బెజ్జంకి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీకి తాళం వేయకపోతే తన పేరు మార్చుకుంటానని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఫ్యాక్టరీలను సహించబోమని, అవసరమైతే  పోరాటం చేస్తామని హెచ్చరించారు.

బెజ్జంకి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ కావాలా.. వద్దా అన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ (ఓటింగ్) నిర్వహించాలని అన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇసుక, మట్టి మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని, ప్రజలు భయాందోళనల మధ్య జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే దమ్ముంటే సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఫ్యాక్టరీల ద్వారా వచ్చే డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం సరికాదని విమర్శించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. ఫ్యాక్టరీల వల్ల ప్రజలకు నష్టం కలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో మండల అద్యక్షులు మహిపాల్ రెడ్డి,మాజీ ఎంపిపి నిర్మల లక్ష్మణ్,పాక్స్ వైఎస్ చైర్మన్ బండి రమేష్, కచ్చు రాజయ్య,తిరుపతి రెడ్డి, బోయినిపల్లి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.