calender_icon.png 6 February, 2026 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

06-02-2026 12:00:00 AM

 ఎంపీ అర్వింద్‌కు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్ 

నిజామాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై నిజామాబాద్ నగర నడిబొడ్డున గల గాంధీ చౌక్ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమా అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సవాల్ విసిరారు. నిజామాబాద్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఏడేళ్లలో ఎంపీగా అర్వింద్ జిల్లాకు తెచ్చిన నిధులు ఎన్ని, ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ మేరకు జరిగిందని నిలదీశారు.

బీజేపీ నేతలు అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో లేరని, అందుకే కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలైన ముద్ర స్కీమ్ జిల్లాలో నత్తనడకన సాగుతుంటే, ఖేలో ఇండియా కింద ఒక్క ప్రాజెక్టునైనా తీసుకు వచ్చారా ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే జిల్లా ముఖచిత్రం మారిందని పేర్కొన్నారు. జిల్లాకు మూడు ఇంటిగ్రేటెడ్ కళాశాలలతో పాటు వ్యవసాయ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు.

కార్పొరేటర్ అభ్యర్థి వంశీ  8 కోట్ల బకాయిల అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండటం వల్లే గతంలో ఆ సొమ్ము చెల్లించలేదని, అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నో డ్యూ సర్టిఫికెట్ కోసం పార్టీ ఆదేశాల మేరకే ఇప్పుడు ఆ నగదు చెల్లించినట్లు స్పష్టం చేశారు. 80 శాతానికి పైగా సీట్లతో నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు ఏ పార్టీతోనూ పొత్తు లేదని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంత దూరమో, ఎంఐఎం కూడా అంతే దూరం అని స్పష్టం చేశారు.