అంత బిజీనా?
- సీఎల్పీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్
- ఇక నిర్లక్ష్యం వద్దు.. మన భవిష్యత్ ప్రణాళిలకపై దృష్టి పెట్టాలి
- ఎమ్మెల్యేలు మీడియాతో చిట్‌చాట్‌లు నిర్వహించొద్దు
- గవర్నర్ ప్రసంగం మనకు రోడ్‌మ్యాప్ లాంటిది
- అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాలపై సభ్యులకు సీఎం దిశానిర్దేశం
హైదరాబాద్, మార్చి16 (విజయక్రాంతి): గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయింది.. ఇక మన భవిష్యత్ ప్రణాళి కలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై సీఎం సీరియస్ అయ్యారు. సీఎల్పీ సమావేశానికి రాలేనంత బిజీగా ఉన్నారా..? అని ప్రశ్నించారు.
మీడియాతో చిట్‌చాట్ చేయవద్దని ఎమ్మెల్యేలను సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. ఏదో ఒక సాకుతో సభ్యులు గైర్హాజర్ కావొద్దని, శాసనసభా సమావేశాలకు సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ ఎమ్మె ల్యేలను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహిం చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని సీఎల్పీ అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన సభ్యులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. శాసన సభ, శాసన మండలిలో అనుసరించే వ్యూహం, ప్రతిపక్షాలు లెవనెత్తే అంశాలకు, వాటికి సమాధానం ఇచ్చే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవాలని, ప్రతిపక్షాల ప్రశ్నలకు పూర్తి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
‘ప్రజాప్రభుత్వంలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతు న్నాం. గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో వివరించారు. సభలో మాట్లాడే అంశాలపై విప్‌ల మధ్య సమన్వయం ఉండాలి. సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృథా కాకుం డా సమర్థవంతంగా నడిపేలా చూడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు సబ్జెక్ట్ మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వలేదు.
సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు, జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదు. సెషన్ మొత్తం నన్ను సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు సభకు రాకుండా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది’ అని సీఎం రేవం త్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల హాజ రు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. మహిళా ఎమ్మె ల్యేలు హాజరుతో పాటు చర్చల్లో పాల్గొనాలని, సభా చర్చల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం అవసరం అని సీఎం చెప్పారు.
వ్యక్తిగత డ్యామేజీ ఉండదు..
అసెంబ్లీ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసుకోవాలని సీఎం తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి, సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదని ఆది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందని తెలిపారు. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందని పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్‌లోనే అందరూ స్పందించాలన్నారు. ఇది మన ప్రభుత్వం ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాపే వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుందన్నారు.
వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై సభ్యులు ఫోకస్ పెట్టాలని, 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందేనని సీఎం ఆదేశించారు. ఈ సమయంలో ప్రజలకు జవాబు దారీతనంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండి.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సీఎం సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కు మార్‌గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ, మండలి సమావేశాలకు సభ్యులంతా హాజరు కావాలన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్ని సబ్జెక్టులపై బాగా ప్రిపేర్ కావాలన్నారు. గవర్నర్ ప్రసంగంలో రెండేళ్ల పాలన పైన అన్ని అంశాలు ఉన్నాయన్నారు. ఈ రెండేళ్లలో దాదాపుగా అన్ని హామీలను నెరవేర్చామని, ప్రతిపక్షాలకు దీటుగా సమాధా నం ఇవ్వాలని మహేష్‌కుమార్‌గౌడ్ సూచించారు. మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందన్నారు.




