నువ్వు డిప్యూటీ లీడర్‌వా.. ఎల్పీ సెక్రటరీవా?
ఏ హోదాలో అడుగుతున్నావ్?
మీ నాయకుడు ఎక్కడ ఉన్నాడు?
నల్లగొండ గురించి మాట్లాడే హక్కే లేదు
హరీశ్‌రావుపై మంత్రి వెంకట్‌రెడ్డి సీరియస్
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ‘నువ్వు ఏ హోదాలో మాట్లాడుతున్నవ్.. డిప్యూటీ లీడర్‌వా? లేక ఎమ్మెల్యేవా.. ఎల్పీ సెక్రటరీవా?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులు, ఫ్లోరైడ్ రక్కసిని తొలగించడంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆరోపించారు.
70 శాతం పూర్తి చేసిన ఎస్సెల్బీసీ సొరంగం, ఇతర ప్రాజెక్టులను గత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా ఎస్సెల్బీసీ సొరంగం వద్దకు రాలేదని మండిపడ్డారు. ఓవైపు మూసీ మురుగు నీరు, మరోవైపు ఫ్లోరైడ్ సమస్య జిల్లా ప్రజలను పీడిస్తున్నా బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంచేసిందన్నారు. గత ప్రభుత్వ కాళ్లావేళ్లా పడినా కనికరించలేదని అన్నారు.
నల్గొండ జిల్లా ప్రజలు ఏం పాపం చేశారని ఆయన ప్రశ్నించారు. పంటలకు నీరులేక వెయ్యి మీటర్లలోతు వరకు బోర్లు వేసే పరిస్థి ఉందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులను పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేయగా.. కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడు ఏడాదిగా సభకు రావడంలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం ప్రజలను అవమానపరచడమేనని అన్నారు.
సాధారణ ఎమ్మెల్యేగా తన గురించి, నల్లగొండ గురించి మాట్లాడే హక్కు హరీశ్‌కు లేదని స్పష్టంచేశారు. అధికారంలో ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాను పట్టించుకోలేదని మండిపడ్డారు. నల్లగొండ ప్రజలు, రైతుల ఆవేదన ఎలా ఉందో తాను చెప్తున్నాని.. డబ్బున్న వాళ్లు హైదరాబాద్‌కు వచ్చారని, లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్పీకర్ మంచివారు కాబట్టి అడిగిన వెంటనే మాట్లాడేందుకు హరీశ్‌రావుకు సమయమిస్తున్నారని తెలిపారు.
మంత్రి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ఎలా?: హరీశ్‌రావు
క్యాబినెట్ నిర్ణయమంటే మంత్రిమండలి సమిష్టి నిర్ణయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడమేంటని ప్రశ్నించారు. ఇలా మంత్రులే ఒకరినొకరు ప్రశ్నలు వేసుకుంటే ప్రశ్నోత్తరాల అర్థమే మారిపోతుందని, ఈ కొత్త సంస్కృతి మంచిది కాదని స్పీకర్‌ను కోరారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఎస్సారెస్పీ స్టేజ్ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడకు అందించామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ హయాంలోనే మూసీ ఈవిధంగా తయారైందని హరీశ్‌రావు ఆరోపించారు.






