మీకు తెచ్చుకోవడం.. తినడమే సరిపోయింది
మీ అప్పులకు 1.18 లక్షల కోట్ల వడ్డీ మేం కట్టినం
ఉన్నవి లేనట్టు చెప్పడం హరీశ్‌రావుకే చెల్లింది
అబద్ధాలు చెప్పడం బీఆర్‌ఎస్‌కు వెన్నతో పెట్టిన విద్య
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): మీ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల అప్పులు తెచ్చుకుని తినడమే సరిపోయిందని, మీరెప్పుడైనా అప్పులు, వాటికి వడ్డీలు కట్టారా అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హరీశ్‌రావును ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీలో రుణాలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తాము అప్పులు తెచ్చి అడ్డగోలుగా ఖర్చు చేయడం లేదని స్పష్టంచేశారు. మీరు తెచ్చిన అప్పులకే రూ.1,18,364 కోట్ల అసలు, వడ్డీ చెల్లించామని హరీశ్‌రావుకు చురకలంటించారు.
కొంత అప్పులు, కొంత ఆదాయం కలిపి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని స్పష్టంచేశారు. ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు చెప్పడం హరీశ్‌రావుకే చెల్లిందని ఆరోపించారు. అప్పుల విషయంలో అబద్ధాలు చెప్పడమే కాకుండా తప్పుడు సమాచారంతో సభనే తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడం బీఆర్‌ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తుచేశారు.
రాష్ర్టం మొత్తం అప్పు రూ.6.71 లక్షల కోట్లు ఉందని పునరుద్ఘాటించారు. బీఆర్‌ఎస్ నేతల పెండింగ్ బిల్లులే రూ.40,150 కోట్లు ఉన్నాయని, అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే రూ.7.19 లక్షల కోట్లు ఉందని స్పష్టంచేశారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.62 వేల కోట్లు అప్పు చేశామని, వాటన్నింటినీ సంక్షేమానికే ఖర్చు చేసినట్టు లెక్కలతో వివరించారు. బీఆర్‌ఎస్ వాళ్ల లాగా తాము ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోలేదంటూ మండిపడ్డారు.
ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లకు అమ్ముకున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏ ఆస్తులను అమ్మకుండానే హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. పదేళ్ల పాటు స్కూళ్లలో డైట్ బిల్లులు పెంచలేదని, తాము పెంచామని.. యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్త్న్నుమని వెల్లడించారు. కాగ్ కూడా గత ప్రభుత్వ తీరును తప్పుబట్టిందని గుర్తుచేశారు. సింగరేణి, సివిల్ సప్లుసై, జెన్‌కో ఇలా అన్నింటా అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేసిపోయారని విరుచుకుపడ్డారు. హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీఐకి పంపించిన నివేదికలను ఇప్పుడు చూపిస్తూ అప్పులపై సభను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పరిధిని దాటి అప్పులు చేయం
రాష్ట్ర అప్పులకు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని తాము నిర్ణయించుకున్నట్టు భట్టి తెలిపారు. పరిధి దాటి తాము అప్పులు చేయబోమని స్పష్టంచేశారు. ప్రభుత్వ అప్పులపై ప్రతిపక్షాలు పదేపదే తప్పుడు ఆరోపణలు చేయడంతో .. ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పేందుకే అప్పులపై చర్చ పెట్టినట్లు భట్టి చెప్పారు.






