అన్నదాతల అరిగోస
లేనిపోని కొర్రీలతో విక్రయాలు మరింత ఆలస్యం
రోజుల తరబడి కల్లాల్లోనే రైతుల పడిగాపులు
క్వింటాల్‌కు ఐదారు కిలోల తరుగు తీస్తున్న నిర్వాహకులు
సేకరించిన ధాన్యానికీ నగదు జమ చేయడంలో జాప్యం
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు, రాస్తారోకోలు
విజయక్రాంతి నెట్‌వర్క్: ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకువచ్చి నెల రోజులైంది. నిర్వాహకులు ధాన్యం కొనడం లేదు. చూసిచూసి కొందరు రైతులు తక్కువ ధరకు దళారులకు వడ్లు అమ్ముతున్నారు. ఒకవేళ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించినా వడ్లను త్వరగా మిల్లులకు తరలించడం లేదు. బ్యాంక్ ఖాతాల్లో సత్వరం నగదు జమ కావడం లేదు.
* ఎన్నికల ముందు అన్ని రకాల వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు సన్న రకానికే బోనస్ అని ప్రకటించింది. 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తుంటే, వారికి సర్కార్ ఎలాంటి భరోసా ఇస్తుంది? తరుగు పేరుతో క్వింటాల్‌కు ౫ నుంచి ౬ కిలోల తరుగు తీస్తున్నారు. అంత తరుగు తీస్తే రైతులకు ఏం మిగులుతుంది?
ఇది జగిత్యాల జిల్లా అప్పారావుపేటకు చెందిన ఓ రైతు ఆవేదన
* జగిత్యాల జిల్లాలో రైతులు 2.97 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దీనిలో 2.80 లక్షల ఎకరాల్లో పండించింది దొడ్డు వడ్లనే. కేవలం 10 వేల ఎకరాల్లోనే సన్నాలు పండినయి. దొడ్డు వడ్లు పండించిన రైతులకు బోనస్ తీసుకునేందుకు అర్హులు కాదంటే వందలో సన్నాలు పండించే ఇద్దరు ముగ్గురికి బోనస్ ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? అయినా.. సన్న రకానికి బయట దళారులే క్వింటాకు రూ. 3 వేలు ఇస్తున్నరు. ఇక రైతులు రూ.500 బోనస్ కోసం సన్నాలు విక్రయిస్తరా? రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేస్తున్నది.
ఇది జగిత్యాల జిల్లాకు చెందిన మరో రైతు రాష్ట్ర ప్రభుత్వానికి సంధిస్తున్న ప్రశ్నలు.
* ఇలా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పెదవి విరుస్తున్నారు. అసంబద్ధంగా బోనస్‌ను నిర్ణయించడం, ధాన్యం సేకరణ ప్రక్రియను సక్రమంగా చేపట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






