బీఆర్‌ఎస్ నేత దారుణ హత్య
వనపర్తి, మే 23 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ నేత బీరం హర్షవర్ధన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు బొడ్డు శ్రీధర్‌రెడ్డి దారుణ హత్య కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్ద నిద్రిస్తున్న శ్రీధర్‌రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఎలాంటి వివాదాలు లేని వ్యక్తి దారుణ హత్య వెనుక ఓ మంత్రి హస్తం ఉందని అక్కడి ప్రజలు, నాయకులు బాహటంగానే చర్చించుకుంటున్నారు. మంచి వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరమం టూ గ్రామస్థులు, పలువురు నాయకులు తమ భాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య లో మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం ఉంద ని శ్రీధర్‌రెడ్డి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో ఎన్నడూ లేని విధంగా రాజకీయ హత్య లు జరగడం ఉద్రిక్తలకు దారి తీస్తోంది. ఈ ఏడాది జనవరిలో నాగర్‌కర్నూల్ జిల్లాలో మల్లేశ్‌యాదవ్ హత్య జరిగింది. నాలుగు నెలల కాలంలోనే మరో హత్య జరగడం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.
జూపల్లి ప్రోద్బలంతోనే
-కేటీఆర్
శ్రీధర్‌రెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాల రాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి శ్రీధర్‌రెడ్డి అంత్యక్రియల కు హాజరై ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్.. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజకీయ హత్యలకు ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ సంస్కృతికి నాంది పలుకుతోందని మండిపడ్డారు. శ్రీధర్‌రెడ్డి హత్యే ఇందుకు నిద ర్శమన్నారు. ఈ హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యేనని అన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన లేదని ప్రతీకార పాలన జరుగుతోందని ధ్వజమెత్తారు.
కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు.. ఎన్నికల్లో ఆయనకు సహకరించని వారిపై ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. మొహబత్ దుకాణ్ అని ఢిల్లీలో రాహుల్‌గాంధీ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని, దానికి అర్థం ఇలాంటి హత్యలు చేయడమేనా? అని ప్రశ్నించారు. గడిచిన నాలుగు నెలల కాలంలో రెండు హత్యలు జరిగాయని, మల్లేశ్‌యాదవ్, శ్రీధర్‌రెడ్డి మరణాల్లో జూపల్లి ప్రోద్బలం లేదా అని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జూపల్లిని బర్తరఫ్ చేయాలని, ఈ కేసుపై సిట్ వేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వరుస హత్యల మీద జ్యుడీషియల్ ఎంక్వైరీ చేపట్టాలన్నారు.
గడిచిన పదేండ్లలో లేని విధంగా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లో హింసాత్మక దాడులు, హత్యలు జరుగుతున్నాయని ఈ విషయంపై రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసులకు మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పిటిషన్ ఇచ్చారని, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోగా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.
శ్రీధర్‌రెడ్డి హత్య సమాచారమిస్తే తీరిగ్గా గంటన్నర తర్వాత పోలీసులు వచ్చారని ఆరోపించారు. పోలీసుల తీరు ఎలా ఉందో అర్థమవుతుందని, వెంటనే ఎస్‌ఐను సస్పెండ్ చేయాలన్నారు. శ్రీధర్‌రెడ్డి తండ్రి హత్యలో జూపల్లి హస్తం ఉందని ఫిర్యాదు చేయగా మంత్రి పేరు పెట్టవద్దని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని కేటీఆర్ తెలిపారు. శ్రీధర్‌రెడ్డికి ఎలాంటి వ్యక్తిగత తగాదాలు లేవని, స్థానికంగా మంచి పేరు ఉందని, రాజకీయంగా ఎదర్కోలేక అర్ధరాత్రి కరెంటు తీసి హత్యకు పాల్పడడం దారుణమన్నారు.






