పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు

28-04-2024 01:00:23 AM

ఎంపీ ఎన్నికల పరిశీలకుడు గోపాల్ జీ తివారీ

కోహిర్, జహీరాబాద్, మొగుడంపల్లిలో పరిశీలిన

జహీరాబాద్, ఏప్రిల్ 27: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు గోపాల్ జీ తివారీ  అధికారులను ఆదేశించారు. శనివారం కోహిర్ మండలంలోని దిగ్వార్, సిద్దాపూర్ గిరిజనతండా, గురుజువాడ, మొగుడంపల్లి మండలంలోని పర్వతా పూర్‌తోపాటు జహీరాబాద్ ఆదర్శ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

పోలింగ్ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో  తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఫ్యాన్లు తదితర సౌక ర్యాలను కల్పించాలని సూచించారు.  పోలింగ్ అధికారులు, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. వయో వృద్థులు, దివ్యాంగులు, గర్భిణులకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా పోలింగ్ కేంద్రాల్లో మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.  కార్యక్ర మంలో ఆర్డీవో రాజు, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి,  తహసీల్దార్లు మల్లేశం, హసీనా, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.