12 August, 2026 | 1:35 AM

పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

12-08-2026 12:00 AM

అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

మేడ్చల్, ఆగస్టు 11(విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను తిలకించేందుకు వచ్చే అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సదుపాయాలు కల్పించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వచ్చే అతిథికి పోలీస్ గౌరవ వందనంతోపాటు, బందోబస్తుల ఏర్పాట్లను చూడాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. వేదిక, కుర్చీలు, బారికేడింగ్ సీటింగ్ వంటి ఏర్పాట్లు ఆర్ అండ్ బి శాఖ, వేదిక వద్దరంగురంగు పూలతో అలంకరణకు  ఉద్యానవన శాఖ అధికారులు చూసుకోవాలన్నారు. మైక్ సౌండ్ బాక్సులను ఏర్పాటు చేయాలని ఐఅండ్ పిఆర్ అధికారులను ఆదేశించారు.

పాఠశాల విద్యార్థులచే దేశభక్తి ని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విధి నిర్వహాణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందచేసేందుకు అన్ని శాఖల అధికారుల వివరాలు సిద్దంగా ఉండేలా చూడాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ మాలతి, కీసర ఆర్డిఓ వెంకట్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.