29 April, 2026 | 3:25 AM

నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

29-04-2026 12:56 AM

అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

మేడ్చల్, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి):  మే 3న జరుగనున్న నీట్ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశాంతంగా, సజావుగా  నిర్వహించేందుకు అవసరమైన  అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నీట్ పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.

ఈ పరీక్షకు జిల్లా నుండి 3 వేల 468 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయం లోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టరు సూచించారు. అభ్యర్థులు చివరి నిమిషలో కంగారు పడకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లో ఉన్న నియమ నిబంధనలను  తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభర్థులకు కరెంట్, మంచినీరు అందులో ఉంచాలని, కేంద్రాల వద్ద పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

వైద్య అధికారులు మెడికల్ కిట్,  అంబులెన్సలు అందుబాటులోఉంచాలని ఆదేశించారు. నిరంతరాయ విద్యుత్తు సరఫరా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు అవసర మైన వీల్ చైర్ వంటి వాటిని అందుబాటులో ఉండేలా డిడబ్ల్యూఓ అధికారిని ఆదెశించారు.   ఈ సమావేశంలో డిఆర్‌ఓ చంద్రావతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.