వరి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 28(విజయక్రాంతి): జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని విధాలుగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎం. డెవిడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, సహకార, పౌర సరఫరాల, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో జరిగిన సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తారావు, జిల్లా సహకార శాఖ అధికారి బి. మనోహర్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రజిత కలసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యాసంగి వరి కొనుగోళ్ల కోసం సెర్ఫ్ ఆధ్వర్యంలో 14, సహకార శాఖ ఆధ్వర్యంలో 19 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎ-గ్రేడ్ వరికి క్వింటాలుకు రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 మద్దతు ధర ఉండగా, సన్న రకం వరికి అదనంగా రూ. 500 బోనస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.సమన్వయంతో పనిచేస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సజావుగా సాగించేలా చూడాలని సూచించారు.






