పరిశోధనల ఫలాలు రైతులకు చేరినప్పుడే సాగు లాభసాటి
వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనల ఫలాలు క్షేత్రస్థాయిలో సామాన్య రైతులకు చేరినప్పుడే సాగు లాభసాటిగా మారుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ‘ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం 2026- సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సోయాబీన్ విత్తనో త్పత్తి, సోయాబీన్ చీడ పీడలకు సంబంధించి న అవగాహన కరదీపికను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేలా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తగిన సలహాలు అందించాలని కోరారు. ముఖ్యంగా అకాల వర్షాలు, పురుగుల ఉధృతిని తట్టుకునే వంగడాల గురించి రైతులకు వివరించాలని, ’ల్యాబ్ నుంచి ల్యాండ్ వరకు’ అనే నినాదంతో శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలని ఆదేశించారు.
సాగులో డ్రోన్ల వినియోగం, నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం వంటి సాంకేతిక అంశాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలు, అంతర పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలన్నారు.
వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పని చేసి విత్తన శుద్ధి నుండి పంట కోత వరకు రైతులకు అండగా నిలవాలని, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, పి.జె.టి.ఎస్.ఏ.యు పరిశోధన సంచాలకులు డా. ఎం. బాల్ రాజ్, విస్తరణ సంచాలకులు డా. యాకాద్రి, ప్రిన్సిపల్ సైం టిస్ట్ డా. శ్రీధర్ చౌహాన్, వ్యవసాయ మిషనరేట్ ప్రతినిధి అనిత, జిల్లా వ్యవసాయ శాఖ, వివిధ జిల్లాల అధికారులు, సిబ్బంది, శాస్త్రవేత్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.






