రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్..
సూర్యాపేట (విజయక్రాంతి): రేపు జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం రేపు జరగనున్న రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన ఆవరణలో నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా వివిధ శాఖలు ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ వి అప్పారావు, ఏ ఆర్ డి ఎస్ పి నరసింహ చారి, ఎస్సీ కార్పొరేషన్ ఎడి శ్రీనివాస్ నాయక్, మైనార్టీ అభివృద్ధి అధికారి జగదీశ్ రెడ్డి, డి టి డి ఓ శంకర్, కార్యాలయ సుదర్శన్ రెడ్డి, డిప్యూటీ సీఈవో శిరీష, డీడబ్ల్యువో నరసింహారావు, మిషన్ భగీరథ ఇంజనీర్లు అరుణాకర్ రెడ్డి శ్రీనివాస్, రాజశేఖర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, డిపిఓ యాదయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






