08-12-2025 04:27:26 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కొరకు అవసరమైన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలని రహదారులు- భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.
విగ్రహం వద్ద రంగుల పూలతో అలంకరించాలని, కార్యక్రమానికి వచ్చే వారికి త్రాగునీరు, టీ, అల్పాహారం అందించాలని తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమానికి 300 మంది విద్యార్థులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి కిరణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.