26 August, 2026 | 4:43 AM

12 మంది నకిలీ వైద్యుల అరెస్టు

26-08-2026 01:25 AM

తక్కువ ఫీజుతో వైద్యం అంటే మోసపోవద్దు

వివరాలు పరిశీలించాకే వైద్యం పొందాలి

వేర్వేరు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు

వివరాలు వెల్లడించిన డీజీపీ వైభవ్ గైక్వాడ్

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఎలాంటి అర్హతలు లేకుండా డాక్టర్ల ముసుగులో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు నిర్వహించిన విస్తృత దాడుల్లో 12 మంది నకిలీ వైద్యులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ నగర డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

నిందితుల నుంచి పెద్ద ఎత్తున గడువు ముగిసిన మందులు, స్లున్ సీసాలు, ఇంజెక్షన్లు, సిరంజీలు, సర్జికల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అరెస్టు అయిన వారిలో కొందరి పేర్లు, ప్రాంతాలను వివరించారు. రహమత్‌నగర్ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనస్థీషియా డిప్లొమాతో డి. రామశేఖర్ రెడ్డి, రాగం సుధాకర్‌లు వైద్యులుగా చెలమణి అవుతున్నారన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన కుమార్తె పేరిట తండి పానుగంటి బాల నరసింహ డాక్టర్ అవతారమెత్తాడని, రోగులను మోసం చేస్తున్నాడని వివరించారు.

మిరుదొడ్డి భారతి నర్సు అనుభవంతో రహమత్‌నగర్‌లో క్లినిక్ నడుపుతుందని, బీఏ చదివిన కాటిక మహేష్‌రావు వెంకటగిరిలో క్లినిక్ నడుపుతున్నాడని, ఇంటర్ ఆపేసిన మహ్మద్ అబ్దుల్ వలీ ల్యాబ్ టెక్నీషియన్ అనుభవంతో బోరబండలో క్లిన్ నిర్వహిస్తున్నాడని, చిలకలగూడ బడి మసీదు సమీపంలో క్లినిక్ నడుపుతున్న నీలగిరి ప్రసాద్, రాణిగంజ్ నల్లగుట్టలో క్లినిక్ నడుపుతున్న అదన్ సమదాని (23), లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలో సాయిరామ్ క్లినిక్ నడుపుతున్న ఎం. శ్రీనివాస్, చిలకలగూడలో పెద్దాపట్ల సదానంద్, మణికేశ్వర్‌నగర్‌లో సరోజినీ పాలీ క్లినిక్ చింతలూరి రమేష్, అదే ప్రాంతంలో సూర్యక్లినిక్ శివరాత్రి లింగయ్యలకు ఎలాంటి అర్హత లేకపోయినా వైద్యులుగా చెలామణి అవుతూ తెలిసీ తెలియని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు.

ఈ నకిలీ వైద్యులంతా తెలిసీ తెలియని వైద్యంతో పలు రకాల యాంటీబయోటిక్స్ మందులు, సూదులు, సిరప్‌లను రోగులకు ఇస్తున్నట్లు తేలిందన్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకూ 600 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశామని డీసీపీ వివరించారు. తక్కువ ఫీజుతో వైద్యం అంటే ప్రజలు మోసపోవద్దని, అన్ని వివరాలు చూసుకున్నాకే వైద్యం తీసుకోవాలన్నారు. ఇలాంటి నకిలీ క్లినిక్, వ్యక్తులపై దాడులు తీవ్రతరం చేస్తామని డీసీపీ హెచ్చరించారు. కాగా పోలీసులు వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున నకిలీ రబ్బరు స్టాంపులు, మందులను స్వాధీనం చేసుకున్నారు.