6 March, 2026 | 11:35 PM

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

06-03-2026 03:18 PM

బీర్కూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఆరైవ్-ఆలైవ్- 2026 ఉచిత కంటి వైద్య శిబిరం

బీర్కూర్ ఎస్సై మహేందర్

బాన్సువాడ,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యమని బీర్పూర్ ఎస్సై మహేందర్ అన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఆరైవ్–ఆలైవ్' 2026 రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బీర్కూర్ పోలీస్ స్టేషన్ నందు వాహనదారులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బీర్కూర్ పోలీసులు లయన్స్ క్లబ్ రాకాసి పేట-బోధన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు 70 మంది ఆటో, లారీ డ్రైవర్లు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారనీ ఎస్సై మహేందర్ తెలిపారు.

నిపుణులైన వైద్య బృందం డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన వైద్య సలహాలు సూచనలు అందజేయడం జరిగిందని ఎస్సై తెలిపారు.ప్రతి వాహనదారుడు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే సంకల్పంతోనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని, వయస్సు పెరిగే కొద్దీ కంటి చూపు మందగించడం సహజమని పేర్కొన్నారు.

ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాలను నడిపే డ్రైవర్లు తమ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రయాణికులను సురక్షితంగా చేర్చే బాధ్యత వారిపైనే ఉందని గుర్తు చేశారు. కంటి చూపు సమస్యలతో వాహనం నడపడం ప్రమాదాలకు దారితీసే అవకాశముందని, అందువల్ల డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ శిబిరం నిర్వహణకు సహకరించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు వైద్య బృందానికి పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ పోలీస్ సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు, పలువురు వాహనదారులు వైద్యులు పాల్గొన్నారు.