19-01-2026 09:09:03 PM
పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి
మంథని,(విజయక్రాంతి): ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి క్షేమంగా ఇంటికి చేరాలనే ఉద్దేశంతో అరైవ్ - అలైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి డిసిపి భూక్యా రాంరెడ్డి తెలిపారు. సోమవారం మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని మంథని-కాటారం ప్రధాన రహదారి గాడిదలు గండి మూలమలుపు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మంథని గంగపురి-ముత్తారం, ప్రధాన రహదారిపై ప్రజలతో నిర్వహించిన అరైవ్ - అలైవ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిసిపి భూక్యా రాంరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి చేరాలనే ఉద్దేశంతో అరైవ్ - అలైవ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఈ కార్యక్రమాన్ని జిల్లాలో కఠినంగా అమలు చేయాలని నిర్ణయించామని, అందులో భాగంగా మంథని మండలంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పట్లాను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటున్నమని తెలిపారు.
ఆర్ అండ్ బి అధికారులతో చర్చించి ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తామని, అరైవ్ - అలైవ్ కార్యక్రమంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి రమేష్, మంథని సీఐ రాజు, ఎస్ఐ రమేష్, తదితరులు పాల్గొన్నారు.