కళాకారులను అన్ని విధాలుగా ఆదుకోవాలి
ప్రజానాట్యమండలి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ముషీరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో సమగ్ర సాంస్కృతిక విధానాన్ని రూపకల్పన చేయడంతో పాటు కళారంగానికి తమ జీవితాలను అంకితం చేస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న కళాకారులను అన్నివిధాలుగా ఆదుకోవాలని పలువురు వ్యక్తలు ప్రభుత్వాన్ని కోరారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు క్రీడారంగానికి ఇస్తున్న కోటా తరహాలో సాంస్కృతిక రంగానికి కూడా కోటా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో ‘సమగ్రమైన సాంస్కృతిక విధానం కళాకారులకు గుర్తింపు, హెల్త్ ఉద్యోగాలు’ అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం హైదరాబాద్ హిమాయత్ మగ్ధూంభవన్‌లో జరిగింది. తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సాంస్కృతిక సలహామండలి సభ్యులు పల్లె నర్సింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ డాక్టర్ జి.వి. వెన్నెల, సురవరం ప్రతాప రెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్,
ప్రముఖ కవి ఆచార్య ఎస్.వి.సత్యనారాయణ, ప్రముఖ సినీ నటు లు మాదాల రవి, ప్రముఖ కవి యాకూబ్, కాంగ్రెస్ సాంస్కృతిక సేవా విభాగం అధ్యక్షులు, సాంస్కృతిక సలహామండలి సభ్యులు చక్రాల రఘు, దివాకర్, అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్ హజరయ్యారు. ఈ సమా వేశంలో మాదాల రవి, పల్లె నర్సింహ, కె. శ్రీనివాస్, యాకూబ్ చక్రాల రఘు, దివాకర్, ప్రజా నాట్యమండలి కార్యవర్గ సభ్యులు ఉప్పలయ్య, నళిని, ప్రమీలతో పాటు వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు.




