అరూరివి చిల్లర మాటలు

02-05-2024 01:01:28 AM

కావ్య పక్కా లోకల్

ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

వర్ధన్నపేట బూత్ కమిటీల సమావేశం

వరంగల్, మే 1(విజయక్రాంతి): ఓటమి భయంతోనే అరూరి రమేశ్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎంఎల్‌ఏ కడియం శ్రీహరి మండిపడ్డారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కావ్య పక్కా లోకల్ అని అన్నారు.  వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బుధవారం జరిగిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కావ్య పర్వతగిరిలో పుట్టి, ఉన్నత విద్యనభ్యసించి, డాక్టర్‌గా వర్ధన్నపేట ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. వ్యక్తిగత విమర్శలు చేస్తున్న అరూరికి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆరూరి రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి రైతుల భూములు లాక్కొని మండలానికో గెస్ట్‌హౌజ్  నిర్మించుకున్నారని విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలలో రెండు నియోజకవర్గాల ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎర్రబెల్లి, అరూరిల దిమ్మ తిరిగిపోయిందని ఎద్దేవా చేశారు.

మనవరాలి వయ సున్న అమ్మాయి చేతిలో ఓడిపోయిన ఎర్రబెల్లి సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అద్భుతమైన మేనిఫెస్టోతో ప్రజల ముందు కొచ్చిందని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద మహిళలకు ఏటా రూ.లక్ష అందిస్తామని చెప్పారు. కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకుంటామని, పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకువస్తామని స్పష్టంచేశారు. నిస్వార్థంగా నియో జకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ముందు కొచ్చిన కడియం కావ్యను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. అవినీతి, భూకబ్జాల అరూరికి ప్రజలు మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పిలుపునిచ్చారు. తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు అరూరి బీజేపీ పంచన చేరాడని, బీజేపీ పార్టీ రైతుల సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఏఐసీసీ ఓబీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, మున్సిపల్ చైర్మన్ ఆంగోతు అరుణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.