19 June, 2026 | 2:43 AM

విధుల్లో నిర్లక్ష్యం వహించిన అర్వపల్లి ఎస్‌ఐ సస్పెండ్

19-06-2026 01:32 AM

పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణలో లోపాలు

ఫిర్యాదులు స్వీకరించడంలో నిర్లక్ష్యం 

విధుల్లో చేరిన నాటి నుంచి పలు ఆరోపణలు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూన్ 18: తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం సర్కిల్ పరిధిలో గల అర్వపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్‌ఐ ఈట సైదులును విధుల్లో నిర్లక్ష్యం, పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణలో లోపాలు, ఫిర్యాదులు స్వీకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశారు.

ఈ మేరకు మల్టీజోన్-2 ఐజీ షానావాజ్ ఖాసిం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అర్వపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డుల నిర్వహణలో పలు లోపాలు గుర్తించడంతో పాటు,బాధితులు ఫిర్యాదులతో వచ్చినప్పటికీ కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎస్త్స్ర సైదులు విధుల్లో చేరిన నాటి నుంచి ఆయనపై పలు అవినీతి,అక్రమాల ఆరోపణలు ఉన్నయి.

ఇట్టి అంశాలపై జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక పంపగా వాటిని పరిశీలించిన మల్టీజోన్-2 ఐజీ ఎస్‌ఐని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన పోలీస్ శాఖలో చర్చాంశానీయంగా మారింది. సంబరాలు జరుపుకున్న బాధితులు ఎస్‌ఐ సైదులు సస్పెండ్ కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని కుంచమర్తి గ్రామానికి చెందిన బాధితుడు ఎండీ అమీనుద్దీన్ ఆధ్వర్యంలో వెంకన్న,సతీష్,ఉపేందర్,శ్రీరాములు,లింగయ్యతో పాటు పలువురు అర్వపల్లిలోని ప్రధాన చౌరస్తాలో రైతులతో కలిసి బాణాసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు.