26 July, 2026 | 12:53 AM

కేజ్రీవాల్‌కు కోర్టులో దక్కని ఊరట

02-06-2024 12:58 AM

నేడు తిరిగి జైలుకి

న్యూఢిల్లీ, జూన్ 1: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు బెయిల్ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర బెయిల్ కొనసాగించాలని.. వైద్య పరీక్షల కోసం వారం రోజుల పాటు బెయిల్‌ను పొడిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. విచారణ తిరిగి జూన్ 5కి వాయిదా వేసింది. దీంతో కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైల్లో సరెండర్ కానున్నారు. విచారణ సమయంలో కేజ్రీవాల్‌కు ఈడీ బెయిల్‌ను వ్యతిరేకించింది. కాగా, మార్చి 21న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం చేయడానికి తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఆశ్రయించగా, 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ గడువు శనివారంతో ముగిసింది.