నకిలీ డాక్యుమెంట్లకు అడ్డాగా కీసర
- గతంలో ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు
- తాజాగా నకిలీ పత్రాలతో బ్యాంకులలో రుణాలు
- సబ్ రిజిస్ట్రార్ రహమాన్ సహకారంతో చెలరేగిన ముఠాలు
- డాక్యుమెంట్ రైటర్ల కీలక పాత్ర
మేడ్చల్, జూలై 25 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా కీసర నకిలీ డాక్యుమెంట్ ల తయారీకి అడ్డాగా మారింది. సబ్ రిజిస్ట్రార్ రహమాన్ సహకరించడం వల్ల ముఠాలు చెలరేగిపోయాయి. ఎస్ ఆర్ రహమాన్ ము ఠాలతో చేతులు కలిపి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేశారు. ఇప్పటివరకు ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలు కబ్జా చేసిన వారిని అరెస్టు చేయగా, తాజాగా నకి లీ డాక్యుమెంట్లతో బ్యాంకులు, హౌసింగ్ రు ణ సంస్థలలో రుణాలు ఇప్పిస్తున్న ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇందులో సూత్రధారులతోపాటు అప్పట్లో ఇక్కడ సబ్ రిజిస్టర్ గా పనిచేసిన రెహమాన్, డాక్యుమెం ట్ రైటర్లు, సాక్షులపై కేసులు నమోదయ్యా యి.
ప్రధాన నిందితుడు వల్లభనేని శ్రీనివాసరావు సూత్రధారి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి వారి పేరు మీద నకిలీ డాక్యుమెంట్ తయారు చేసి బ్యాంకులు, హౌ సింగ్ ఫైనాన్స్ ల నుంచి రుణాలు ఇప్పించా డు. తొమ్మిది గృహాలపై రూ.4.11 కోట్లు రు ణం ఇప్పించాడు. ఇందులో మొత్తం 29 మంది నిందితులుగా పోలీసులు గుర్తించగా, 9 మందిని అరెస్టు చేశారు. 21 మంది పరారీలో ఉన్నారు. సబ్ రిజిస్టర్ రెహమాన్ సహకరించడంతో ఈయనను ఏ 9 నిందితుడిగా చేర్చారు. రుణ గ్రహీతలు మొదట్లో ఈఎంఐ చెల్లించి తర్వాత చెల్లించకపోవడంతో బ్యాం కు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి డాక్యుమెంట్లు పరిశీలించగా నకిలీవని తేలింది.
రెహమాన్ హయంలోనే..
కీసర సబ్ రిజిస్టార్ గా రెహమాన్ 2016 నుంచి 8 సంవత్సరాలు పనిచేశారు. ఆయన పని చేసిన హయాంలోనే నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేశారు. రుణాలు తీసుకోవడానికి సహకరించడమే గాక ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్ సృష్టించగా వాటిని రిజిస్ట్రేషన్ చేశారు. రెండు నెలల క్రితం పోలీసు లు జరిపిన విచారణలో సంచలన విషయా లు వెలుగులోకి వచ్చాయి. 20 కి పైగా నకిలీ డాక్యుమెంట్ కేసులు నమోదయ్యాయి.
రూ.100 కోట్ల పైన విలువచేసే ప్లాట్లకు నకిలీ పత్రాలు..
కీసర ప్రాంతంలో రూ.100 కోట్ల పైన విలువ చేసే ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పదికిపైన ముఠాలు పనిచేశాయి. వీరితో రహమాన్ కుమ్మక్కయ్యారు. నకిలీ పత్రాల కేసులో పోలీసులు 84 మందిని అరెస్టు చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు. మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉంది. పోలీసులు నకిలీ పత్రాలతో రుణాలు తీసుకున్న కేసులో, అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలని ప్రజలు కోరుతున్నారు.






