అంచనాలు నిజమయ్యేనా?
ఎగ్జిట్ పోల్స్ ప్రభావం ఎంత?
ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన పలు ఏజెన్సీలు
న్యూఢిల్లీ, జూన్ 1: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై ఊహాగానాలకు జూన్ 4వ తేదీన తెరపడనుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అయితే శనివారం చివరి దశ పోలింగ్ ముగియగానే పలు మీడియా, ప్రైవే టు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో ముందుగానే ఎన్నికలు ముగిశాయి. కొన్ని రాష్ట్రాల్లో తర్వాతి దశల్లో జరిగాయి. అయితే ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పిన అంచనాలు గతంలో ఎంతవరకు నిజమయ్యాయి.. అసలు ఎగ్జిట్ పోల్స్‌ను ఎలా నిర్వహిస్తారనేది తెలుసుకుందాం.
అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే..?
ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు ఓటర్లు ఓటేసి బయటకు రాగానే వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ఓటర్లు ఇచ్చే సమాధానం ఆధారంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందనేది అంచనా వేస్తారు. దీన్నే ఎగ్జిట్ పోల్స్ అంటారు. ఎన్నికలు జరుగుతుండగా ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేసినా, ప్రచురించినా వేరే రాష్ట్రాలో ఓటర్లను ప్రభావితం చేస్తాయనే కారణంతో చివరి దశ ఎన్నికలు ముగిసిన తర్వాతే వాటిని విడుదల చేయాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అంచనాలు నిజమవుతాయా?
సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌కు, వాస్తవ ఫలితాలకు చాలా తేడా ఉంటుంది. అయితే ఎవరిది పైచేయి అనే విషయం మాత్రం ఎగ్జిట్ పోల్స్‌తో దాదాపు తేలిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత టీవీల్లో డిబేట్స్, విశ్లేషణలు నిర్వహించుకోవచ్చు.
ఎలా నిర్వహిస్తారు?
ఎగ్జిట్ పోల్స్‌ను వివిధ సంస్థలు స్టాటిస్టికల్ విశ్లేషణలు, శాంప్లింగ్ మెథడ్స్‌ను కలిసి లెక్కిస్తారు. తొలుత ఏజెన్సీలు ప్రాంతాల వారీగా ఓటర్ల సమూహాన్ని ఎంపిక చేసుకుంటాయి. ఒక్కో ఓటరు దగ్గరకు వెళ్లి ఎవరికి ఓటేశారు? ఎక్కడ నివసిస్తారు.. వారి వయ సు ఎంత వంటి ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో సేకరించిన డాటా మొత్తాన్ని ఒక దగ్గరకు చేర్చి రికార్డు చేస్తారు. అన్ని వర్గాలు, అన్ని వయసులు, అన్ని ప్రాంతాల వారు వచ్చేలా సర్వే చేసే వారు జాగ్రత్త పడుతారు. ఎలా అంటే ఒక శాంపిల్‌లో మొత్తం యువకులతో మాత్రమే మాట్లాడకుండా.. అన్ని వయసుల వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు.
నిపుణుల విశ్లేషణతో అంచనాలు..
సేకరించిన డాటా మొత్తాన్ని ఎన్నికలకు సంబంధించి అనుభవం ఉన్న నిపుణులు విశ్లేషిస్తారు. ఓటర్ల నాడీ ఎలా ఉందో వారు అంచనా వేస్తారు. అయితే వారి అంచనాల కచ్చితత్వం ఎంత ఉందో కూడా నిపుణులు చెబుతారు. ఆ తర్వాత వారి అంచనాలను ప్రజల ముందు ఉంచుతారు.
2014, 2019 ఎన్నికల్లో ఏమైంది?
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే అంతటి భారీ విజయాన్ని నమోదు చేస్తుందనే విషయం మాత్రం ఏ సంస్థ కూడా అంచనా వేయలేకపోయింది. కొన్ని సంస్థలు యూపీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ వాటి అంచనాలు తప్పయ్యాయి. 2019 ఎన్నికల్లో కూడా కొన్ని సంస్థలు యూపీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ బీజేపీ ఏకంగా 303 సీట్లు గెలుచుకుంది. ఎన్డీయేతో కలుపుకొని 352 సీట్లు వచ్చాయి.






