మళ్లీ తిరిగొస్తానో లేదో..
రేపు మధ్యాహ్నం 3 గంటలకు జైలులో లొంగిపోతా
జైలులో నన్ను చిత్రహింసలు చేస్తారు
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వీడియో సందేశం
న్యూఢిల్లీ, మే 31: తాను జూన్ 2వ తేదీన తీహార్ జైలులో లొంగిపోతానని, అయితే మళ్లీ ఎప్పుడు తిరిగొస్తానో, ఎంత కాలం జైలులో ఉండాల్సి వస్తుందో కూడా తెలియదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశాన్ని నిరంకుశత్వం నుంచి కాపాడేందుకు జైలుకు వెళ్తున్నానని, అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ‘వాళ్లు (బీజేపీ నేతలు) నన్ను నాశ నం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. నా నోరు మూయించాలని చూశారు. కానీ వారు విజయం సాధించలేదు. నేను జైలు లో ఉన్నప్పుడు కూడా చాలా రకాలుగా వేధించారు. నాకు మందులు కూడా ఇవ్వలేదు. వాళ్లకు ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు.
ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు’ అని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను జైలుకు వెళ్లిన సమయంలో నా బరువు 70 కేజీలు ఉండేది. ఇప్పుడు 64 కేజీలకు తగ్గింది. జైలు నుంచి విడుదలయ్యాక కూడా నా బరువు పెరగట్లేదు. ఇలా జరిగితే చాలా సీరియస్ వ్యాధి వచ్చే ప్రమా దం ఉందని డాక్టర్లు కూడా చెబుతున్నారు. నేను చాలా రకాల పరీక్షలు చేయించుకోవా లి. నేను జైలుకు వెళ్లాక బీజేపీ నన్ను టార్చర్ చేస్తుంది. అయినా కూడా నేను వారి ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదు. నేను జైలులో ఉన్నా.. బయట ఉన్నా ఢిల్లీలో పను లు తాను ఆగనివ్వను’ అని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్స్, ఉచిత మందులు, చికిత్స, 24 గంటల పాటు విద్యుత్‌తో పాటు అనేక పథకాలు కొనసాగుతాయని భరోసా ఇచ్చారు. ఇక జైలు నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలోని మహిళలందరికీ నెలకు రూ.1000 ఇస్తామని హామీ ఇచ్చారు.
మా అమ్మకోసం ప్రార్థించండి..
తాను జైలుకు వెళ్లిన తర్వాత తన తల్లి ఆరోగ్యం బాగుండాలని అందరూ ప్రార్థించాలని కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను కోరారు. ‘మా తల్లిదండ్రులకు వయసు పైబడింది. మా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నేను జైలుకు వెళ్లిన తర్వాత ఆమె గురించి చాలా దిగులు పడుతుంటా. ఎప్పుడూ ఆమె గురించే ఆలోచిస్తుంటా. నా తల్లిదండ్రులను మీరే జాగ్రత్తగా చూసుకోండి. వారి ఆరోగ్యం కోసం ప్రార్థించండి’ అని కోరారు.
ఎన్నికల ప్రచారం కోసం బెయిల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే తాను ఎన్నికల ప్రచారం చేసుకోవాలని కోరగా, సుప్రీం కోర్టు 21 రోజుల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రేపటితో బెయిల్ గడువు ముగియనుండటంతో మరో రెండు వారాల పాటు బెయిల్ పొడిగించాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ పొడిగించేది లేదని సుప్రీం కోర్టు తెగేసి చెప్పడంతో ఆయన జూన్ 2న మధ్యాహ్నం 3 గంటల సమయంలో జైలు అధికారుల ముందు లొంగిపోతున్నట్టు వెల్లడించారు.






