26 February, 2026 | 8:03 AM

తమిళంలో నాయికగా..?

26-02-2026 01:21 AM

ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన ‘బేబి’ సినిమాతో తెలుగు నాట సూపర్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది హైదరాబాదీ బ్యూటీ వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతోనే మరో సినిమా చేస్తోందీ భామ. ఇదిలావుండగా, వైష్ణవి చైతన్య గురించి ఓ ఆసక్తికర వార్త వినవస్తోంది. తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వైష్ణవి సిద్ధమవుతోందనేదే ఆ వార్తల సారాంశం.

కోలీవుడ్ హీరో కమ్ ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయిక పాత్రగా నటించే అవకాశాన్ని వైష్ణవి చైతన్య దక్కించుకుందట. అయితే, వైష్ణవి ఇప్పటికే తమిళ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. అజిత్‌కుమార్ నటించిన ‘వలిమై’ చిత్రంలో ఓ క్యామియో రోల్‌లో నటించటం ద్వారా కోలీవుడ్ తెరపై తొలిసారి మెరిసింది.

ఇప్పుడు జీవీ ప్రకాశ్ సరసన కథానాయికగా ఎంట్రీ ఇస్తోందని తెలుస్తోంది. ఈ విషయమై మూవీ టీమ్ నుంచి కానీ, వైష్ణవి చైతన్య నుంచి కానీ అధికారిక ప్రకటన ఏమైనా వస్తుందేమోనని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే నిజమైతే, వైష్ణవి చైతన్యకు తమిళంలో హీరోయిన్‌గా తొలి సినిమా ఇదే కానుంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో వైష్ణవి చైతన్య నిమగ్నమై ఉందన్న విషయమైతే అర్థమవుతోంది.