26 February, 2026 | 4:09 AM

విజయ్ జంటకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

26-02-2026 01:20 AM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కొద్దిగంటల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ నూతన వధూవరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ వేడుకకు తనను ఆహ్వానించిన విజయ్ తల్లిదండ్రుల పేరిట ప్రధాని లేఖ రాశారు. ఈ నోట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ వివాహ వేడుక ఆహ్వానం అందుకోవడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారాయన.

వారి జీవితంలో ఇది అందమైన, కొత్త అధ్యాయానికి నాంది అని, పవిత్ర సంప్రదాయమైన సప్తపది స్ఫూర్తితో జీవితాంతం స్నేహితులుగా, దంపతులుగా అన్యోన్యంగా ఉండాలని ఆశీర్వదించారు. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ వారిద్దరూ ప్రేమానురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని అందంగా నిర్మించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర గౌరవంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని, విజయ్ జీవితం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. విజయ్ వివాహం ఉదయ్‌పూర్‌లో గురువారం ఘనంగా జరుగనుంది. ప్రీ వెడ్డింగ్‌లో భాగంగా నిర్వహించే హల్దీ వేడుక బుధవారం ముగిసింది.