calender_icon.png 12 July, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రిగా మీరు ఈ జిల్లాకు చేసిందేమి లేదు

11-07-2025 12:00:00 AM

మహబూబాబాద్ మున్సిపాలిటీ 50 కోట్ల రూపాయల జివో అమలెక్కడ?

ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ 

మహబూబాబాద్, జూలై 10 (విజయక్రాంతి): మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కు లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శంతన్ రామరాజు అన్నారు.  మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి సీతక్క,  స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే మీద, కాంగ్రెస్ పార్టీ మీద చేసిన విమర్శలను తిప్పికొట్టారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంతన్ రామరాజు మాట్లాడుతూ పదేళ్ల పాటు తెలంగాణలో విధ్వంసపు పాలన చేసిన మీరు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో ప్రజలంతా సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందుకుంటున్న నేపథ్యంలో  అవాకులు చెవాకులు పేలడం తగదన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఈ జిల్లాకు చేసిందేమిటో చెప్పాలన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టిన ఘనత మీకే దక్కిందని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మానుకోటకు 400కోట్ల నిధులు తెచ్చిన ఘనత ఎమ్మెల్యే మురళి నాయక్ సాధించారని పేర్కొన్నారు.

కేటీఆర్, కేసీఆర్ మానుకోట పర్యటనలో మానుకోటకిచ్చిన 50 కోట్లు, వార్డుల మౌలిక సదుపాయాల కోసం 1కోటి 98లక్షల రూపాయల ఇచ్చినట్లు ప్రకటించిన ఆ జీవో కాపీలను చూపిస్తూ అవి నిజమైన జీవోలు అయితే అధికారంలో ఉన్న సమయంలో పనులు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. మీరుచేసిన పాపాలు శాపాలై మీకు ఓటమిని తెచ్చాయని, ఆ కడుపు మంటతో స్థాయిని మరచి విమర్శలు చేయడం తగదన్నారు.

కేసీఆర్ కుటుంబానికి కట్టప్పలా, కట్టు బానిసలా ఊడిగం చేసిన మీకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతికత లేదన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజా సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నామని, ఇకనైనా మీరు, మీ కేటీఆర్, మానుకోట బిఅరెస్ నాయకత్వం ఇంకో సారి కారు కూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించారు.

స్థాయిని మరిచి మీ కేటీఆర్ చేస్తున్న సవాలుకు మేము సరిపోతామని దమ్ముంటే మానుకోటకు ఇచ్చిన ఉత్తుత్తి జీవోలపై చర్చకు రావాలని ఓ కుర్చీని కూడా ఇక్కడ ఖాళీగా ఉంచామని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీపార్టీ తరపున నిలబడటానికి కూడా అభ్యర్థులు దొరకరన్నారు.

ఊరుకు ఒకరిద్దరు బాగుపడితే అది బిఅరెస్ పాలన, ఊరంతా బాగుపడితే అది కాంగ్రెస్ పాలన ఇందిరమ్మ రాజ్యమన్నారు. ఈ సమావేశంలో నాయకులు  సత్య మనోరమ, కమ్మగాని కృష్ణమూర్తి, నారాయణ్ సింగ్, సిరిపురం వీరన్న, గుగులోత్ రాములు నాయక్, భానోత్ హరిసింగ్ నాయక్, లకావత్ పద్మ, గండ్రాతి మల్లేష్, భూక్య లక్ష్మి, మాధవి, రాము పాల్గొన్నారు.