12-07-2025 11:55:38 AM
జైపూర్,(విజయక్రాంతి): చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసినా వదిలి పెట్టేది లేదని, అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, శాఖాపరమైన చర్యలు తప్పవని జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శని వారం జైపూర్ మండలం ఇందారం గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గ్రామంలో అనుమానాస్పద, కొత్త వ్యక్తులు ఎవరు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గ్రామ ప్రజలతో ప్రజలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యపై పోలీస్ లను స్పందిస్తే వారు ఎలా ప్రతిస్పందిస్తున్నారని, భద్రత పరమైన విషయాలపై, పోలీసుల పని తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే డయల్ 100కు కాల్ చేయాలని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్...
గ్రామంలోని రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీట్స్ లకు జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారి ప్రస్తుత పరిస్థితి, జీవన విధానంను అడిగి తెలుసుకున్నారు. ప్రజా జీవనానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్ట ప్రకారం ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవించే ప్రజలకు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటారని, వారికీ సహాయ సహకారం అందిస్తారన్నారు.
నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు...
ఇందారం గ్రామంలో నార్కోటిక్ డాగ్ తో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, నిలువ, సరఫరాలపై నిఘా, నియంత్రణలో భాగంగా గ్రామంలోని అనుమానస్పద ప్రాంతాలను, గృహాలను, ఇంటి పరిసరాలను తనిఖీ చేశారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించి 70 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఇతర వాహనాల ఆర్సీ, ఇన్సూరెన్స్ పేపర్లు చెక్ చేసి సరైన వాహన పత్రాలు లేని వాటికి జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ వేణు చందర్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్, టీఎస్ఎస్పీ పోలీసులు, సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.