10 July, 2026 | 2:29 AM

వాహనదారుల భద్రతకు అశ్వాపురం పోలీసుల ముందస్తు చర్యలు

10-07-2026 01:31 AM

అశ్వాపురం, జూలై 9 (విజయక్రాంతి): మండలంలోని మొండికుంట పెట్రోల్ బంక్ సమీపంలో మణుగూరు కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కన ఏర్పడిన ప్రమాదకర గుంతను గురువారం గుర్తించిన అశ్వాపురం పోలీసులు వెంటనే స్పందించి వాహనదారుల భద్రత కోసం ముందస్తు చర్యలు చేపట్టారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంత స్పష్టంగా కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే గుంత వద్ద హెచ్చరికగా డివైడర్ను ఏర్పాటు చేసి, ప్రమాద సూచికలను ఉంచి వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించేలా చర్యలు తీసుకున్నారు.

పోలీసుల సమయోచిత స్పందనతో ప్రమాదాలు జరగకముందే నివారణ చర్యలు చేపట్టడాన్ని స్థానికులు, వాహనదారులు అభినందిస్తున్నారు. ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అశ్వాపురం పోలీసులు వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని పేర్కొంటూ ‘శభాష్ అశ్వాపురం పోలీసులు‘ అంటూ పలువురు కొనియాడారు. రహదారి పక్కన ఏర్పడిన ఈ ప్రమాదకర గుంతను సంబంధిత శాఖ అధికారులు శాశ్వతంగా పూడ్చి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.